మదిలో మెదిలే భావాలను మాటసాయంతో మగవారు వ్యక్తీకరిస్తే... అతివలు అతిగా మాటాడక క్రియాత్మకంగా, ప్రతీకాత్మకంగా, కొండొకచో ప్రతీకారాత్మకంగా కూడా అభివ్యక్తీకరిస్తారు.ఆ భాష అర్ధం చేసుకునే మగవాడి జీవితం ‘తేనెవెన్నెల’.అర్ధం చేసుకోలేదో... ఆ పురుషుడు ఇక రుషుడే..హైటెక్‌ సిటీలో అమెరికన్‌ బాంక్‌. అందులో ఎగ్జిక్యూటివ్‌గా ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టాడు నరేంద్ర. ఇక అప్పట్నుంచీ నగరంలో ఒంటరిజీవనం. హోటల్‌ మెతుకులు.ఫైవ్‌డే వీక్‌ కాబట్టి శని, ఆదివారాల్లో సొంతూరుకెళ్లి కాస్త ఎంగిలిపడి జిహ్వ చాపల్యాన్ని బతికించుకోవడం.కొడుకలా నగరంలో ఒంటరిగా ఉంటూ ఉడికీ ఉడకని మెతుకులు కతుకుతూ చాలీచాలని భోజనం చేస్తుంటే నరేంద్ర తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం.పోనీ... నరేంద్ర దగ్గరే ఉండి ఆలనాపాలనా చూద్దామనుకుంటే పల్లెటూర్లో పొలం పనులు, అంతులేని బాధ్యతల బంధనాలు వారిని క్షణం ఖాళీగా ఉండనీయడం లేదు. అందుకే... ఈ ఏడాది ఎలాగైనా నరేంద్రకి పెళ్లిచేయాలనే నిర్ణయానికి వచ్చేసారు. అనుకోవడమే. తరువాయి... పెళ్లిసంబంధాలు వెతకడం ప్రారంభించారు.ఇక, ఇక్కడ నరేంద్ర స్వహస్తాలతో తన రూం తాళం తానే తీసుకునే దౌర్భాగ్యం నుంచీ వేగిరం తనని తప్పించమని కనిపించని దైవాన్ని భక్తి శ్రద్ధలతో కోరుకునేవాడు. తాను ఇంటికి వెళ్లి కాలింగ్‌బజ్జర్‌ మోగించగానే గాజుల సంగీతం నేపధ్యంగా జీవన సహచరి తలుపులు తీసి తనకు ఆహ్వానం పలకాలనే తీయని తలపులెన్నో కంటున్నాడతను.

జడనిండుగా మల్లెలు తురుముకుని, చూపుల దీపాలు వెలిగించుకుని, వంపుసొంపుల హంపి శిల్పంలా తనకోసం ఎదురుచూసే అర్ధాంగి రాకకోసం అతను కొన్నాళ్లుగా క్షణాలను నిరీ‘క్షణాలు’గా అనువదించుకుంటున్నాడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు.పోస్ట్‌లో తల్లితండ్రులు పంపిన పెళ్లికూతుర్ల ఫొటోల్లో ఒక్కటీ అతనికి నచ్చేవి కావు. ఒక్కరూ మనసుని తాకేవారు కాదు. నిజానికి, నరేంద్ర వెండితెరపై అందాలరబోసే ఛార్మి, ఇలియానాలాంటి సెల్యూలాయిడ్‌ శిల్పాలను, సరస సౌందర్య అప్సరసలను అర్ధాంగిగా రావాలని కోరుకోవడం లేదు. అయితే, చూసీచూడగానే కించిత్‌ భావుకత్వాన్ని రెచ్చగొట్టి ఇన్నాళ్లూ గుండెల్లో గడ్డాలు పెంచుకుని తిష్టవేసుకుని కూర్చున్న సృజనశీలిని తట్టిలేపగల ఒకే ఒక అందం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుతెన్నులు చూస్తున్నాడు.దాంతో ఎన్నో సంబంధాలు వెతికినా ఓ పట్టాన కుదిరేవి కావు.ఆఖరికి విసుగు చెందిన నరేంద్ర తల్లితండ్రులు ‘ఈ పిల్లాడికి పెళ్లవుతుందా?’ అని బెంగపడుతున్న తరుణంలో ఓ సంబంధం కుదిరింది. వధువు-హారిక. బిఎ లిట్రేచర్‌. తెలుగుమాస్టారమ్మాయి.నరేంద్ర కళ్లకి ఆమె అభిసారిక. వధువు తరపువాళ్లు పంపించిన ఫొటో గ్రాఫ్‌లో మోడ్రన్‌ డ్రస్‌లోనూ, పెళ్లి చూపుల్లో అందమైన కనికట్టు చీరకట్టులోనూ పెళ్లికూతుర్ని చూసాడు నరేంద్ర. అటు ఆధునికత, ఇటు సంప్రదాయం కలనేతగా ఆమె ఉందని ఉబ్బితబ్బిబ్బయ్యాడతను. అందుకే... మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. మరోమాట లేకుండా ‘పిల్లనచ్చింద’ని చెప్పేసాడు నరేంద్ర.