సామర్లకోట రైల్వేస్టేషను.మద్రాసు వెళ్లే మెయిలు.రైలెక్కి ఒక్క నిమిషం అయి వుంటుంది. వెంకటేశ్వర్లు పోర్టరు చేత సామాన్లు సర్దించి, అతనికి డబ్బులిచ్చేసి, సీట్లో చతికిలబడి భార్యాబిడ్డల వేపు, ఆనక కంపార్టుమెంట్లో మిగిలిన వాళ్ళవేపు కలయజూశాడు.కార్నర్‌ సీట్లో ఆయనా, శ్యామలా ఒకర్నొకరు పరీక్షగా చూసుకొంటున్నారు.ఒకసారి ఆయనవేపూ, ఒకసారి శ్యామలవేపూ చూసి మళ్ళీ అటు తిరిగాడు వెంకటేశ్వర్లు.‘‘ఎందాకా వెళుతున్నారండి. మీరు?’’ అని అడిగాడు. ‘‘మి?-ఒంగోల్‌!’’ అన్నాడతను ఇటు చూడకుండానే.శ్యామల పాపాయిని ఎదటి బెంచిమీద నుంచి ఈ బెంచి మీదికి మార్చి ఎడం చేత్తో జోకొడుతూ అతనివేపు అలా చూస్తూనే వుంది.ఒక నిమిషం పాటు ఎవరూ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అలా చూసుకోడం వెంకటేశ్వర్లుకి ఏమీ బాగాలేదు.అతను శ్యామలకి బంధువో, స్నేహితుల కుటుంబంలోని వాడో అయి వుండాలి, ఇద్దరికిద్దరూ గుర్తు తెచ్చుకోలేక పోతున్నారని తెలుస్తూనే వుంది.

 తనేమీ సాయం చెయ్యలేక, భరించలేక అలా చూస్తూ కూచున్నాడు, అతను కూడాను.‘‘మీ దేవూరండి!’’ అంది శ్యామల హఠాత్తుగా.‘‘తుని! మీదో?’’‘‘కాకినాడ. మీరు కాకినాట్లో చదివారా?.... ఒకవేళ మా అన్నయ్య కోసం మా యింటికి వస్తుండేవారా? మిమ్మల్నెక్కడో చూశాను!’’‘‘నన్ను చెప్పమంటారా?’’ అని అతను చిరు నవ్వుతో వెంకటేశ్వర్లు వేపు చూశాడు. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’.వెంకటేశ్వర్లు సమస్య విడిపోయినంత ఆనందం చూపిస్తూ నవ్వాడు. ‘‘చెప్పండి చెప్పండి... ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అసలు చిన్నప్పటి ఫ్రెండ్సుని వొకో సమయంలో గుర్తుపట్టలేం. నా కట్టా చాలా సార్లయింది!’’ మరచిపోవడం తప్పులాంటిదని తెలిసినా ఇబ్బందైన పరిస్థితిని వీలయినంత త్వరగా దాటెయ్యాలని అతని ప్రయత్నం.‘‘సారీ, ఎట్లా చెప్పాలో నాకు తెలీటం లేదు!’’ అని చిరునవ్వు నవ్వి ‘‘ఇప్యూ డోంట్‌ థింక్‌ అదర్‌వైజ్‌’’ అని ఇంగ్లీషులో మొదలుపెట్టి, ‘‘ఆమెని వొకప్పుడు వాళ్ళింటిలోనే పెళ్లిచూపుల తతంగంలో చూశాను. ఆమెని పెళ్ళాడిన అదృష్టవంతులు మీరేననుకుంటాను’’ అన్నాడతను.వెంకటేశ్వర్లు షాక్‌ తిన్నాడు. కాని ఆ సంగతి తెలీకుండా ఏదో అందామని ‘‘నేనూ అదే అనుకున్నాను. లేకపోతే అంత తొందరగా యెట్లా మరచిపోతాం?’’ అన్నాడు. పరిస్థితి సరిగా అదుపులోకి రాలేదని అతని కదలికల వల్ల తెలిసి పోతోంది.‘‘ఇప్పుడేం చేస్తున్నారండీ!’’ అనడిగింది శ్యామల, మెరిసే కళ్ళతో.ఆరేళ్ళ క్రిందట... అతను తనను చూడ్డానికొచ్చినప్పుడు - తను పదిహేడేళ్ళ పడుచు. స్కూలు ఫైనలు పాసయింది. ఇంటరూ, డిగ్రీకోర్సూ చదువుదామని తన ఉద్దేశ్యం.

పెళ్ళిచేసి అత్తారింటికి పంపుదామని మిగతా వాళ్ళందరి ఉద్దేశ్యం. మెజారిటీ నిర్ణయం నెగ్గింది.అప్పటికీయనకు ఇరవై రెండేళ్ళుంటాయేమో! సంపెంగ వాసన పూసుకొచ్చిన వెన్నెల్లాంటి మత్తు సౌందర్యం అతనిది. గుండ్రని మొహం మీద నాకెందుకని వెనక్కి పారిపోయిన క్రాఫింగూ, ముందుకొచ్చేసిన ముక్కూ, మధ్యలొత్తతో గడ్డం, పేరుకు తగినట్టుగా ‘‘మనోహరంగా’’ ఉన్నాడని తను అనుకోడం, చూడ్డం తనకింకా జ్ఞాపకం వస్తున్నాయి. ‘‘చూపులకొచ్చిన మొగకుంకని అలా చూస్తే వాడేమయిపోతాడూ!’’ అని మేనమామ దెప్పిపొడుస్తే - నలుగుర్లోనూ చెప్పరాని సిగ్గేసింది.