శరత్‌తో తను చెప్పాల్సిన మాటలను మళ్ళీ మననం చేసుకుంది రాధిక. ఒక పట్టాన చిక్కడు దొరకడు. ఎప్పుడూ ఏదో ఆట పట్టిస్తూ ఉంటాడు. అతను తన మాట కాదనకుండా ఎలా ఒప్పించాలి అని ఆలోచించింది. పెళ్ళైన తర్వాత ఆరునెలల వరకు కాపురానికి పంపలేదు ఆమె పుట్టింటి వారు. శరత్‌తో కలిసి ఉండటం మొదలుపెట్టి కొన్ని నెలలే గడిచింది. అందుకే శరత్‌ దగ్గర మాట్లాడటానికి ఒకోసారి కాస్తంత బెరుకు ఆమె మనసులో మెదులుతూ ఉంటుంది.కాఫీ కలిపి కప్పుల్లో పోసి ట్రేలో పెట్టుకుని హాల్లోకి వచ్చింది.సోఫాలో కూర్చుని పేపర్‌ చదువుతున్న శరత్‌కి ఆమె కాలిమువ్వల సవ్వడి వినిపించి తలఎత్తి చూసాడు.

నీలం రంగుచీరలో మెరిసిపోతోంది అప్సరసలా. ఎంగేజిమెంట్‌ తర్వాత ఒకసారి కలుసుకున్నప్పుడు శరత్‌ గిప్ట్‌గా ఇచ్చిన చీర అది. ఆ చీరంటే ఇద్దరికీ ప్రత్యేకమైన ఇష్టం.ట్రేను టీపాయ్‌ మీద ఉంచి తాను శరత్‌ పక్కనే కూర్చుని కాఫీ అందించింది రాధిక చిరునవ్వుతో.‘‘ఏమిటి విశేషం?’’ అన్నాడు శరత్‌ కప్పు అందుకుని తాను కూడా నవ్వుతూ.తెరిచి ఉన్న పెద్దపెద్ద కిటికీల లోనుంచి ధారాళంగా గాలి వీస్తున్నది. ఐదంతస్థుల భవనంపై ఉన్న విశాలమైన పెంట్‌హౌస్‌ వాళ్ళది. గాలికి రాధిక శిరోజాలు అల్లరిగా ఎగిరి శరత్‌ ముఖాన్ని తాకుతున్నాయి. తన చేత్తో సుతారంగా వాటిని తొలగించి ‘‘ముందు కాఫీ తీసుకో, తర్వాత చెప్తాను’’ అంది.

‘‘ఊరించక చెప్పరా! వేచి ఉండటం అంటే నా కసలు ఇష్టం ఉండదు’’ అన్నాడు.అంతవరకూ ఏ విధంగా తన కోరిక బయట పెట్టాలా అని ఎన్నో రకాలుగా ఆలోచించుకున్న రాధిక, ‘ఎలా చెప్పాలి ఏ విధంగా ఒప్పించాలి’ అనుకుంటూ సందిగ్ధంలో పడింది.ఆల్చిప్పల్లాంటి సోగకళ్ళను కిందకు వాల్చి ఆలోచనల్లో పడిన రాధికను గమనిస్తూ ఆమె సాన్నిహిత్యంలోని ఆనందాన్ని అనుభవిస్తూ పారవశ్యంలో ఉన్నాడు శరత్‌.‘‘మరి, మరి....’’ అంటూ ఆగిపోయింది.‘‘ఎందుకు మొగమాటం. నువ్వడిగితే చందమామనన్నా తెచ్చివ్వనా?’’ ఆమె మనసులో ఉన్న కోరిక బయటకు చెప్పలేకపోతున్నదని గ్రహించి కాస్త ఉత్సాహ పరిచేలా అన్నాడు.