నియాన్‌ బల్బుల మెరుపులకు అందకుండా ఆ ప్రదేశం దోబూచులాడుతోంది. వింతరంగుల్లో నవ్వుతున్న పూలు తలలూపుతూ ఊసులాడుకుంటున్నాయి. నెమ్మదిగా వీస్తున్న చిరుగాలి ఆ ఊసులను మోస్తూ ఉంది. కళాత్మకంగా కత్తిరించబడిన పచ్చగడ్డిపైన తన ప్రతాపం చూపడానికి తగినంత వీలుందని చందమామ సంబరపడుతున్నాడు.‘‘రోజంతా కాన్ఫరెన్స్‌తో కాలం బాగానే గడచిపోతుందండీ! కానీ సాయంత్రం నుండి ఆ హోటల్‌ గదుల్లో ఇరుక్కోవడం ఇబ్బంది. అందుకే...భోజనం తర్వాత కాసేపు నాలుగు మాటలు చెప్పుకుందామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను’’ అన్నారు మూర్తిగారు. ఆయనకు వయస్సు యాభై దాటి ఉండవచ్చు. కానీ అంతకు మించిన పెద్దరికమే ఉందతనిలో. ఆయనకు కుడిఎడమలుగా శ్యామల, శ్రీవత్స కూర్చుని ఉన్నారు. ఎదురుగా కూర్చొని ఉన్న శంకర్‌ పచ్చగడ్డి మెత్తదనాన్ని చేతితో తాకుతూ ఆస్వాదిస్తున్నాడు.‘‘సాహిత్య రాలేదేమిటి’’ అన్నారు మూర్తిగారు. ఆ మాట పూర్తి కాక మునుపే సాహిత్య మరొక ఆవిడను వెంటబెట్టుకుని వస్తూకనిపించింది. ‘‘గుడ్‌ ఈవినింగ్‌...అందరికీ...ఈవిడ మానస. కాన్ఫెరెన్స్‌లోనే పరిచయం అయ్యింది. కాసేపు ఇక్కడ కాలక్షేపం ఉంటుందని తీసుకొచ్చాను’’ అంది సాహిత్య.‘‘చల్లగాలికి కాసేపు బైటనించొని ఉన్నాను. సాహిత్య మిమ్మల్ని పరిచయం చేస్తానని ఇక్కడకు తీసుకువచ్చారు.

ఈ ప్రదేశం నిజంగా చాలా బాగుంది’’ మనస్ఫూర్తిగా అంది మానస.ఇంతలో ఒకవ్యక్తి వీరి వైపుగా వచ్చాడు. అందరినీ పరికించి చూస్తూ, ‘‘మీరంతా కాన్ఫరెన్స్‌కు వచ్చినవారేగా. నేను కూడా మీతో జాయిన్‌ అవ్వచ్చా’’ అనడిగాడు. ‘‘తప్పకుండా...రండి కూర్చోండి...అన్నట్టు...మీ పేరు’’ అడిగారు మూర్తిగారు. ‘‘చైతన్య’’ అన్నాడు తమాషాగా కళ్ళతో నవ్వుతూ. మూర్తిగారు చైతన్యకు మిగతావారిని పరిచయం చేసాడు. ‘‘సరే! ఈ సమావేశ ఉద్దేశ్యం చెబుతాను. ఒక్కొక్కరుగా తమకు నచ్చిన సంఘటనలు చెప్పాలి...మొదటగా...శంకర్‌’’ అన్నారు మూర్తిగారు. ‘‘అయ్యో! నాతోనే మొదలా?....సరే చెప్తాను...కొన్ని క్షణాల మౌనం తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు. చల్లగాలికి ఊగుతున్న పూలమొక్కలు అతను చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నట్టు తలలూపాయి.జీవితంలో ముఖ్యమైన సంఘటనలెన్నో ఉండొచ్చు. కానీ నా జీవితంలో నేను ఇష్టపడే సంఘటన ఒకటే ఉంది. నేను చెప్పబోయే సంఘటన నాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని నేను చెప్పను. అలాగని బాధ కూడా కాదు. ఎందుకో...ఇష్టం...అంతే.నేను పనిచేసే ఆఫీసు పక్కనే మా డిపార్టుమెంటుకు అనుబంధంగా ఇంకో బిల్డింగ్‌ ఉండేది. ఎప్పుడైనా అవసరం మేరకు అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక సెక్షన్‌కు హెడ్‌గా ఒక ఆవిడ ఉండేవారు. ఆమె డిప్యూటేషన్‌ మీద అక్కడికి వచ్చిందనీ పని బాగా చేస్తుందనీ...మా ఫ్రెండ్స్‌ చెప్పేవాళ్ళు. ఆ సెక్షన్‌కు వెళ్ళినప్పుడంతా యధాలాపంగా ఆమెను చూసేవాడిని. క్రమంగా ఆమెను చూడటం కోసమే ఆ సెక్షన్‌కు పనికల్పించుకుని వెళ్లడం మొదలు పెట్టాను.