కళ్లెదురుగా కనిపిస్తోన్న నిలువెత్తు శిల్పాన్ని తదేక దీక్షతో చూస్తూ కాస్సేపు నిలబడి ఎందుకో తలతిప్పి చూసిన మదాలసకు ఇంచుమించు తగిలేంత దూరంలో నిలబడి తనంతవరకూ చూస్తోన్న శిల్పాన్నే నిర్నిమేషంగా చూస్తోన్న వ్యక్తి కనిపించాడు.అతడి పేరు అభిరాం.చుట్టుపక్కల గుంపులు గుంపులుగా ఉన్న జనం కూడా తమ కళ్ళెదురుగా కనిపిస్తోన్న వివిధ శిల్పాల్ని చూడడంలో నిమగ్నులై ఉన్నారు.

 తన ముందున్న స్ర్తీ తలతిప్పి చూడడంతో అభిరాం దృష్టి తాత్కాలికంగా శిల్పం మీది నుంచి ఆమె మీదకు మరలింది.అంత అద్భుతమైన అందగత్తెను అతడంతవరకూ చూడలేదనేందుకు నిదర్శనంగా అభిరాం కళ్ళు విచ్చుకున్నాయి. విచ్చుకున్న అతడి కళ్లలో ఆశ్చర్యానందాలు కలగలిసిపోయిన భావన కదలాడింది.అదే సమయంలో మదాలస కూడా అతణ్ని పరీక్షగా చూసింది. అయిదు క్షణాలలోపే ఆమె పరీక్ష ముగిసింది. వెంటనే ఆమె పెదాలమీద దరహాసం తొణికిస లాడింది.