ఆయన వయసు, అధిక మాసాల్తో లెక్కేస్తే వంద ఉంటుందని అంతా అనుకుంటారు.ఆయన తరం వాళ్ళూ, ఆయన తర్వాత తరం వాళ్ళూ, ఆ గ్రామంలో ఎవరూ లేరు. అంత టిక్కెట్టు పుచ్చుకుని ఎప్పుడో పైకెళ్ళిపోయారు.ఆయనకో పేరుంది. అదెవరికీ పెద్దగా గుర్తుండదు. అందరికీ ఆయన తాతగారే.ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులని జిబ్రాల్టర్‌ రాక్‌ లా నుంచుని ఎదుర్కొన్నారు. ఆటు పోట్లకి తట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం డొలక పువ్వులా ఉన్నారు. అందరూ పోవడంతో మనవడు సింహాద్రి దగ్గరుంటున్నారు.ప్రస్తుతం ఆయన సుబ్రమణ్యంతో కవుర్లేసుకుంటున్నారు.‘‘ఏవిటో సుబ్రమణ్యం, ప్రతిరోజూ జరిగిపోయినదే గుర్తొస్తోంది. జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే, పెద్దవాడినయిపోయానని అర్ధం. పెద్దవాళ్ళంటే అందరికీ బోరే. అవునా, కాదా, ఏవంటావ్‌?’’సుబ్రమణ్యం ఏం అనలేదు.‘‘పోనీ, ఓ పుస్తకం రాయనేంటీ? నాకు బోర్‌ కొట్టదు. నన్ను చూసేవాళ్ళకీ బోర్‌ కొట్టదు. ఆలోచన ఎలా ఉంది?’’‘‘బావుంటుంది. పుస్తకం రాసేయండి.....’’‘‘అయితే గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేస్తాను... ఏవంటావ్‌?’’‘‘వొద్దు, తాతగారూ వొద్దండి. ఆ గీతాంజలిని యిప్పటికే చాలామంది చేసారు. యింకేదయినా రాయండి.....’’కాస్సేపు ఆలోచనలో పడి, ఆ తర్వాత ఉత్సాహంగా చిటికె వేసి, ‘‘అద్దీ...’’ అన్నారు.‘‘ఊరే... సుబ్బు.... అదీ యిదీ అనువాదం ఎందుకు? నా జీవితం రాసేస్తాను.....వెయ్యేళ్ళ క్రితం మా పూర్వీకులు తంజావూరు నుంచి, రాజమహేంద్ర వరం ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో రాస్తాను.

 రాజరాజ చోళుడు తన కూతురు అమ్మంగ దేవేరిని రాజరాజ నరేంద్రుడి కిచ్చి పెళ్ళి చేసాక పద్దెనిమిది గోత్రాల వారు కావేరి తీరం నుంచి కాలి నడకన వచ్చిన వైనం, కొంతమంది ఎక్కడ ఆగిపోయారో, కొంతమంది ఒరిస్సా విజయ నగరం, విశాఖపట్నాలకి సముద్రం ద్వారా వెళ్ళిపోయినది, కొంతమంది గోదావరిని చేరుకున్నది అన్నీ నాకు తెలిసినది రాస్తాను.ఉరే సుబ్రమణ్యం, నీకు తెలీదు... నీకేంటీ... చాలా మందికి తెలీదు, రాజ కులైక భూషణుడు, రాజమనోహరుడు, చాళుక్య మన్మథుడు అంటూ రాజరాజుని కీర్తించి, శ్రీవాణీ గిరిజాశ్చిరాయా అనే శ్లోకంతో భారత రచన ఆరంభించిన నన్నయ భట్టు కూడా ద్రావిడ బ్రహ్మణుడేమో అని నా అనుమానం. ఎందుకంటే ఆయన కూడా మా పుర్వీకుల్లాగే తంజావూరు నుంచి వచ్చాడని విన్నానులే...యింకా ఎన్నో ఎన్నో... ఈ కోనసీమ కరవులు, కాటను దొరగారి పుణ్యాన సస్యశ్యామల భూములు, పందొమ్మిది వందల యాభైమూడులో వచ్చిన వరదలు,... దుర్గాబాయమ్మగారు ఈ ఊరు రావడం, జమీందారు గారింట ఉండి పిల్లలందరికీ దేశభక్తి పాటలు నేర్పించడం.. ఇలా ఎన్నో ఉన్నాయి.. ఇది రాస్తే బావుంటుంది ఎలా ఉందోయ్‌ రాసే అంశం....’’ కళ్ళెగరేసి అడిగారు తాతగారు.