గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం బయలుదేరాడు అభిరామ్‌. ఎప్పట్నుంచో పెళ్ళి పెళ్ళి అని తల్లితండ్రులు గొడవ చేస్తూంటే ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతూ ఇక తప్పదన్నట్లు ఆ రోజు అమ్మాయిని చూసేందుకు బయలు దేరాడతను.నిజానికి అభిరామ్‌కి కూడా బ్రహ్మచారి లైఫ్‌ బోర్‌ కొట్టింది. పైగా అతని ఫ్రెండ్స్‌ అందరూ ఒక్కొక్కరే పెళ్ళి చేసుకుని స్థిరపడిపోతున్నారు.రోజూ సాయంకాలం కలిసే మిత్రబృందం పలుచబడి పోతూంటే చివరికి తను వంటరిగా మిగిలిపోతానేమోనని దిగులు మొదలైంది అభిరామ్‌కి.అంతకుముందు సంవత్సరమే చెల్లెలికి కూడా పెళ్ళయిపోయి కాపురానికి వెళ్ళిపోయింది. అతని తల్లితండ్రులకు ఒంటరితనం బాధ పెట్టసాగింది. కొడుక్కి పెళ్ళయ్యి మనవడో మనవరాలో పుడితే కాలక్షేపం అవుతుందనే ధ్యాస మొదలైంది వాళ్ళకి. ఇక అప్పట్నుంచి కొడుకుని పెళ్ళిచేసుకో పెళ్ళి చేసుకో అంటూ పోరు పెట్టసాగారు.చివరకి సరే అన్నాడతను. దాని ఫలితమే ఈ పెళ్ళి చూపులు. అభి రామ్‌ తండ్రి మాధవరావు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఈ మధ్యే రిటైరయ్యాడు. తల్లి సీతాదేవి గృహిణి. పెద్దగా చదువుకోకపోయినా తెలివైందీ - సమర్థవంతమైంది. భర్త ఉద్యోగం చేస్తూంటే ఇంటి విషయాలు సరిదిద్దుతూ సంసారం చక్కగా నడుపుకొచ్చింది.ఎంతో పొదుపుగా పదిలంగా కుటుంబాన్ని నడుపుకొస్తూ పిల్లల చదువులూ పెళ్ళిళ్ళకీ నాలుగురాళ్ళు వెనకేసేలా భర్తకు తోడ్పటమే కాకుండా అతనికి అన్నివిధాలా చేదోడు వాదోడుగా ఉంటూ విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకునేలా చేసింది.నిజానికి మాధవరావు ఉద్యోగం చేసి జీతం భార్య చేతిలో పెట్టడం తప్ప మరేది పట్టించుకునే వాడు కాదు.

 భార్య దక్షత మీద ఆయనకు అంత నమ్మకం.అభిరామ్‌ కూడా తల్లితండ్రుల నుంచి చాలా నేర్చుకున్నాడు. బాచిలర్‌ లైఫ్‌ అనుభవిస్తూనే చెల్లెలి పెళ్ళి విషయంలో తల్లి-తండ్రులకు సాయంగా నిలబడ్డాడు.అలాగే పెళ్ళయ్యాక హైదరాబాద్‌లో ప్లాట్‌ కొనే ఆలోచనలో ఉన్నాడు.అందుకే మాధవరావుకీ - సీతాదేవికి పిల్లల పట్ల ఏమంత బెంగ లేకపోయింది.ట్రెయిన్‌ బయలు దేరటానికి ఇంకా టైముంది. కిటికీ ప్రక్క సీటు దొరికింది అభిరామ్‌కి. బయటకు చూస్తూ కూర్చు న్నాడు. కాసేపటికి మెల్లగా కంపార్ట్‌మెంట్‌ నిండసాగింది.ఇంతలోకి అభిరామ్‌ ఎదురు సీట్లో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. చేతిలో ఉన్న చిన్న ఎయిర్‌బ్యాగ్‌ సీటు క్రింద సర్దుకుని వాటర్‌ బాటిల్‌ ప్రక్కన పెట్టుకుని కూర్చుంది. అభిరామ్‌ ఆమెని పరిశీలనగా చూశాడు. అందంగానే ఉందా అమ్మాయి. ఇప్పటి అమ్మాయిలకు భిన్నంగా ఆమె చీర కట్టుకుని ఉంది. పొడుగైన జడ... ఆకర్షణీయమైన రూపం.ఆమె సీట్లో స్థిరపడి ఎదురుగా కూర్చున్న అభిరామ్‌ వైపు చూసింది. కంగారుగా అభిరామ్‌ చూపులు తిప్పుకున్నాడు. ఆకతాయి అనుకుంటుందేమోనని అతని భయం. ట్రెయిన్‌ కదిలింది. అభిరామ్‌ అంతకుముందు కొనుక్కున్న మేగ్‌జైన్స్‌ చేతిలోకి తీసుకుని చూడసాగాడు.