చదువుకునే రోజుల్లో జీవితం అంటే పూలబాటఅనుకునే వాడు రఘు.చదువు ముగించాక గానీ తెలియలేదు. పూలబాటసిద్ధంగా పరచి ఉండదు. ఎవరికి వారు పూలబాటచేసుకునేందుకు అహర్నిశలూ శ్రమించాలి అని...ఉద్యోగ ప్రయత్నాల్లో విసుగొచ్చేసింది.అసలే ఉద్యోగమూ దొరకలేదని కాదు... దొరికిన ఉద్యోగాల్లో దేన్లోనయినా చేరేందుకు నామోషీ అనిపించింది.తన తండ్రి ఒక ఆఫీసర్‌ పోస్ట్‌లో రిటైరయ్యారు. ఆఫీసర్‌ గారి కొడుకు తాను చిన్న ఉద్యోగం చెయ్యడమా అన్న ఆలోచన పురుగులా బుర్రలో దూరింది.ఎలాగో అలా ఎవర్నో ఒకర్ని పట్టుకుని పెద్దఉద్యోగం వేయించకూడదా ఆయన? రోజులు చక్రంలా దొర్లి పోతున్నాయి. వాదనికి దిగాడు ఓ రోజు తండ్రితో .‘‘మీకు తెల్సిన వాళ్ళలో పెద్దపెద్ద వాళ్ళుంటారు కదా. వాళ్ళ సిఫారసుతో నాకో మంచి పెద్ద ఉద్యోగం ఎందుకు వేయించరూ?’’‘‘అలాంటి పన్లు నాకు తెలియవురా’’ ఉన్న మాటే చెప్పాడు రామ్మూర్తి.‘‘మీ ఉద్యోగంలో మీరెవరి అండదండల కోసం పాకులాడకుండానే రిటైర్‌ అయ్యే దాకా నెగ్గుకొచ్చారా మీరు?’’కొడుకు అలా అడిగినందుకు... వాడి మనసులో అలాంటి ఆలోచన కలిగినందుకు బాధనిపించింది రామ్మూర్తికి. తన సంగతి తెలిసి కూడా ఆ మాట అనడం సమంజసమేనా? కానీ కొడుకావిధమైన ప్రశ్న సంధించినప్పుడు సమాధానం చెప్పక తప్పదు కదా!‘‘నా ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తిస్తూ రిటైరయ్యాను. ప్రమోషన్ల కోసం ఎప్పుడూ తప్పుదారి తొక్కలేదు. అందని వాటి కోసం అర్రులు చాచలేదు. ఎవరి చేతా మాటనిపించుకోలేదు’’.‘‘చిన్న చిన్న ఉద్యోగాల్లో చచ్చినా చేరను’’ రివ్వున బాణంలా దూసుకొచ్చింది మాట.కొడుకు మాటలకి భూదేవి కల్పించుకోకుండా ఉండలేక పోయింది.‘‘పాడిందే పాడరా అని... నీ మొండి పట్టుదలా నువ్వూనూ... చిన్న ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పైకొచ్చారు మీ నాన్నగారు. నువ్వూ అలా పైకిరావాలి గానీ...’’‘‘అమ్మా! ఆ రోజులు వేరు... ఈ రోజులు వేరు... ఉద్యోగాల్లో చేరడమే నెలకి పాతిక వేలు ముప్ఫయ్‌ వేలల్లో చేరుతున్నారు’’.

నవ్వాలో ఏడవాలో తెలియలేదు భూదేవికి.‘‘వాళ్ళు చదివిన చదువులు వేరు... వాళ్ళకొచ్చిన మార్కులు వేరు. నీ సంగతలా కాదుకదా ఒక్కొక్క తరగతీ రెండేసేళ్ళు చదువుతూ.... చదువంటే నిర్లక్ష్యంతో... బయట జులాయి తిరుగుళ్ళల్లో గడుపుతూ విలువైన కాలాన్ని కరగబెట్టుకున్నావు. మంచీచెడూ తెలియజెప్పిన అమ్మానాన్నల్ని శత్రు వుల్లా చూశావు. డింకీలు కొడుతూ బి.ఏ. డిగ్రీ అయిందనిపించావు’’. ఈ మాటలన్నీ ఆవిడ గొంతులోనే ఉండిపోయాయి.తనని చిన్నబుచ్చడానికే అమ్మ ఈ మాటలందని అనుకుంటాడు తప్ప తన తప్పు ఒప్పుకునే మనిషి కానప్పుడు ఏం మాట్లాడి ఏం లాభం?కొడుకు మాటలకి రామ్మూర్తికి నవ్వూ కాదు ఏడుపూ కాదు. కోపం వచ్చిన మాట నిజం... కానీ... ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం మరోటి లేదు అని కోపంగా ఉన్నప్పుడు మాట్లాడక పోవడమే మంచిదని నిగ్రహించుకున్నాడు. తెలిసిన వాడికి చెప్పవచ్చు... తెలియని వాడికి చెప్పవచ్చు... తెలిసీతెలియని మూర్ఖుల కెందుకూ చెప్పడం?... తండ్రి వెళ్ళి వీళ్ళ కాళ్ళూ వాళ్ళ కాళ్ళూ పట్టుకోవట్లేదని... అప్పులు చేసి ఎవరికీ లంచాలు గుమ్మరించట్లేదనీ... తనకి పెద్ద ఆఫీసర్‌ ఉద్యోగం వేయించట్లేదని ఆయన్నొక చేతకాని వాడి కింద జమ కట్టి మాటలంటుంటే ఇంక భరించలేక పోయింది భూదేవి.