తల పగిలిపోతున్నా ఆలోచనల అగ్గి పుట్టడం లేదు. చేతిలోని ఫైల్లో బోలెడు కథలున్నాయి. అయినా కొత్తగా ఏదైనా లైన్‌ ఫ్లాష్‌ అవుతుందేమోనని ఓ ఆశ.సారథి స్టుడియో కళకళలాడుతోంది. పొద్దున తొమ్మిది గంటలకు స్టుడియో బయట బండి మీద టిఫిన్‌ తిని లోపలకు వచ్చాను. ఒకప్పుడు సినీ హీరోయిన్‌గా వెలిగి ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న వైశాలి కూతురు వినమ్ర హోస్ట్‌ చేస్తున్న ఓ రియాల్టీ షో షూటింగ్‌ జరుగుతోంది అక్కడ. పోయిన ఆదివారం ప్రొడక్షన్‌ ఆఫీసు దగ్గర ఆడియన్స్‌ పాసులు తీసుకున్న జనం రియాల్టీ షో షూటింగ్‌ జరుగుతున్న ఫ్లోర్‌లోకి వెళ్లడానికి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.లండన్‌లో ఏంబీయేతో పాటు ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేసొచ్చిన వినమ్ర తల్లి పలుకుబడితో టీవీ రంగంలోకి వచ్చింది.

 ఏడాదికాలంగా బుల్లితెరపై తనదైన ప్రజెన్స్‌తో దుమ్ము దులిపేస్తోంది. సంపాయించిన సొమ్ముతో లోబడ్జెట్‌లో హై ప్రాఫిట్‌ తెచ్చి పెట్టే సినిమా తీయాలనే ఆలోచనలో ఆమె ఉందని వినమ్ర మేకప్‌మ్యాన్‌ తంగవేలు చెప్పడంతో అపాయింట్‌మెంట్‌ తీసుకుని వచ్చాను. 10 గంటలకు రమ్మన్నారు. తొమ్మిదింటికే వచ్చేసాను. కాని మధ్యాహ్నం దాకా వినమ్రను కలవడం కష్టమని ఆమె మేనేజర్‌ చెప్పాడు. షూటింగ్‌ జరుగుతున్న ఫ్లోర్‌ పక్కనే ఉన్న మురికివాడ సెట్‌లోని బస్టాప్‌ దగ్గర నన్ను కూర్చోబెట్టాడు. పక్కనే వినమ్ర కారవాన్‌. వినమ్ర లంచ్‌ వాన్‌లో చేసి ఓ అరగంట రెస్ట్‌ తీసుకుంటుందని ఆ టైమ్‌లోనే ఏవైనా కథలు వింటుందని అతడు చెప్పడంతో వ్యాన్‌వంకే చూస్తూ కూర్చున్నాను. టైమ్‌ ఒంటిగంట కావొస్తోంది.పదేళ్లుగా ఇండసీ్ట్రలో ఉన్నాను. పేరుకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అన్న మాటే కానీ దాని కన్నా ఘోస్ట్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాను. సంపాదనకేమీ లోటు లేదు. కాకపోతే టైటిల్స్‌లో డైరెక్టర్‌గా పేరు చూసుకోవాలనే కోరిక మొదట్నుంచి పెండింగ్‌లోనే ఉంది. డైరెక్టర్‌ శంకర్‌ స్ట్లైల్లో మెసేజ్‌ విత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథల్ని, కె.విశ్వనాథ్‌, బాపు త రహాలో ఆర్టిస్టిక్‌ లుక్‌ ఉన్న సినిమాకు పనికొచ్చే కథలను ఫైల్లో కుక్కుకుని వచ్చాను. ఎవరో వచ్చినట్టు అనిపించి ఆలోచనల నుంచి బయటికొచ్చాను.

ఒక యువకుడు నా పక్కనే కూర్చుంటూ కనిపించాడు. చిల్లుల జీన్స్‌ ప్యాంట్‌, స్టోన్‌వాష్‌ షర్టు వేసుకున్నాడు. పలచగా మొలిచిన గడ్డం, చిందరవందరగా పెరిగిన జుట్టు...రఫ్‌ లుక్‌తో క్లాస్‌గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. భుజానికో ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ తగిలించుకుని ఉన్నాడు.‘‘హాయ్‌! నా పేరు విశ్వాస్‌’’ అని చేయి చాపాడు.‘‘హలో! నాపేరు సన్యాసిరాజు బిఏ’’ అని చేయందుకుం టూ బదులిచ్చాను.