‘‘నింగి నుంచి దూకినట్టు, నేల నుంచి పైకి ఎగిరినట్టు.... గాలితో కలిపి నడుస్తున్నట్టు... అప్పుడప్పుడు చేతులు చాచి పలకరించే వారిని, చల్లదనంతో చుట్టుముట్టేస్తున్నట్టు... మార్నింగ్‌వాక్‌లూ, జాగింగులూ, రన్నింగులూ.... అందమైన ప్రకృతిలో డేటింగులూ... వాహ్‌.... ఆ దృశ్యాన్ని ఏ అదృశ్యరూపంలోనో రతీ,మన్మధులు చూస్తే.... విరహమే ఉష్ణ మండలమై ఆవిరై పోదూ... కలయికేఅనుభవాల వర్షమై, శృంగారాన్ని నిలువెల్లా తడిసి వెళ్ళిపోదూ... ఆ అనుభూతి ధన్యమైతే.... ఈ విరహమెంత మధురమో.... కదూ....’కోయంబత్తూర్‌....ఎయిర్‌పోర్ట్‌....వెల్‌ కమ్‌ టు కొడైకెనాల్‌... అన్న ప్లకార్డుతో క్లబ్‌ మహేంద్ర రిప్రజెంటేటివ్‌.ఆశ్చర్యంలో నుంచి అనుభవం లోకి నడిచొచ్చినట్లు... అదృశ్యంలో నుంచి దృశ్యాన్ని చూసినట్టు... పెళ్ళినాటి సప్తపదిని ఇష్టపదిగా మార్చుకొని అతని చిటికెన వేలును అపురూపంగా పట్టుకొని నడుస్తోంది మధువనివగలుపోయే నగర సుందరి అందాన్ని ఆస్వాదించి, వయ్యారాలతో మెరిసిపోయే పల్లె సొగసుల నయగారాన్ని వీక్షిస్తూ రిలాక్సవుతున్నారు విరించి, మధువని. అంతా కలలా వుంది.కలే నిజమైనట్టుంది.కలే వరమైనట్టుంది.

అందమైన అమ్మాయి పొడవాటి జడలా వున్న నల్లటి తారు రోడ్డు మీద, కారు చెలికాడి చుంబన యాత్రలా మెరుపు వేగంతో వెళ్తోంది.సాయం సమయం...మబ్బులన్నీ ఒక్కటై.... ముప్పొరిగొన్న ఆనందాన్ని చల్లదనంతో పంచుకుంటూ, ప్రకృతి శరీరాన్ని అందమైన చీరలా చుట్టుకున్నట్టు... నేలకు-నింగికి మధ్య వేలాడుతూ, గెంతులాడుతూ కదులుతూ వెళ్తుంటే...మధువని భర్తకు దగ్గరగా జరిగింది. వర్షానికి ముందు వచ్చే ఇష్టమైన మట్టివాసన... కారు స్పీడుగా వెళ్తుంటే, మబ్బులు మనల్ని తాకి వెళ్తోన్న ఫీలింగ్‌... చుట్టూ పచ్చని చెట్లు, కొండలు... కారులో మంచి మెలోడి సాంగ్స్‌.... విరించికి ఓ అలవాటు. ఏ టూర్‌కి వెళ్ళినా అతనికిష్టమైన మంచి మంచి సాంగ్స్‌ సిడిని దగ్గర ఉంచుకుంటాడు. ఆ సాంగ్స్‌ వింటూ, అందమైన ప్రకృతిని చూస్తూ ప్రయాణించడం, మధ్యలో ఆకలేసినప్పుడు దిగి దాబా దగ్గర లంచ్‌, డిన్నర్‌లు చేయడం చాలా ఇష్టం.ఈసారి కూడా అలాగే మెలోడి సాంగ్స్‌ వున్న సి.డి. ప్లే చేసాడు.అలాంటి జర్నీ అంటే మధువనికి కూడా చాలా ఇష్టం. దాదాపు ఇద్దరి యిష్టాలు ఒక్కటే. అప్పుడప్పుడు చిన్నచిన్న తేడాలున్నా, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటారు. అది మొక్కుబడిగా వుండదు. ఎంతో యిష్టంగా వుంటుంది.అప్రయత్నంగా తలను భర్త భుజం మీద వాల్చింది... సె.... క్యూ.... ర్డ్‌... ఫీలింగ్‌. ఈ క్షణమే ప్రపంచం గ్లోబల్‌ వార్మింగ్‌తో తునాతునకలైనా చలించనివ్వని ఫీలింగ్‌.ఇదేమిటి... ఈ అద్భుతమైన కానుకేమిటి... ఈ కొడైకెనాల్‌ ట్రిప్‌ ఏమిటి..?విరించి మధువని నడుం చుట్టూ చేయివేసి దగ్గరకు లాక్కొన్నాడు. ఒక్క క్షణం అలానే భర్తని అల్లుకు పోవాలనిపించింది.