డాబా తూర్పు పిట్టగోడ వైపు ఎవరో లాగుతున్నట్లు వెళ్లి, బలంగా గాలి పీల్చి, వదిలి, ‘‘నరవాసన’’ అనే రాక్షసుడిలా, ‘‘ముదరమాగిన జీడిపండ్ల వాసన’’ అన్నాడు భద్రం - మా వైపు తిరుగుతూ.‘‘తింటావా?’’ అడిగా.‘‘జీడిపిక్కలుంటే నాచేత తినిపించు’’.‘‘పచ్చివా, వేయించినవా?’’‘‘పచ్చివైనా నమిలి మింగెయ్యగలడు. నీకు అనుమానమా?’’ సూర్యం.‘‘భద్రంతో పాతికేళ్ల అనుభవం’’ అతని సామర్థ్యం మీద నాకు ఇసుమంతైనా సందేహం లేదని సూచనప్రాయంగా వ్యక్తం చేశాను.‘‘ఉత్తమాటలెందుకు?’’ తొందర పడ్డాడు భద్రం.మెట్లు దిగుతున్నప్పుడు ‘‘పండ్లు కూడా తే’’ అరిచాడు పైనించి.కిందికెళ్లి పళ్లెంలో, వేయించిన జీడిపిక్కలు, ఎరుపు తిరిగిన జీడిపండ్లు, చెంబుతో నీళ్లూ, గ్లాసులూ తెచ్చేసరికి డాబా కురుక్షేత్రంలా ఉంది.‘‘ఇంతకూ, తినటానికే పుట్టి, తినటానికే జీవితం కొనసాగిస్తున్నానంటావ్‌?’’ సుబ్బు భద్రాన్ని నిలేస్తున్నాడు.‘‘ఘనత వహించిన పెద్దలారా, తమ జన్మలెందుకో, జీవితాలు ఏ గొప్ప ఆదర్శానికై కొనసాగుతున్నాయో శలవీయండి’’.‘‘తినటం గురించి మాత్రం కాదు’’.‘‘ఒక కొలిక్కిరాని వ్యర్ధపు ఆలోచనలతో గడపటానికేమో?’’ రెట్టించాడు భద్రం.‘‘భద్రాన్ని తినెయ్యకండిరా; వాడ్ని ముందు వీటిని తిననీయండి. ఆ తర్వాత మీ అఘోరింపు సాగించొచ్చు’’ జోక్యం చేసుకున్నా.‘‘ఏ ప్రశ్నా. ఆలోచనా నన్ను వేధించదు’’ ప్రకటించాడు భద్రం.‘‘జీడిపండ్లు. పిక్కలు మాత్రం నీలో కదిలకను తెస్తాయి’’ ఖైనీ ఇస్తున్న మత్తు, మాటల్లో వ్యక్తమవుతుండగా అన్నాడు సుబ్బు.

‘‘జీవిత స్వభావం, ప్రాయోజకత, నిగూఢత, తాత్కాలికతల మీద ఎందరు బుర్రలు పాడుచేసుకోలేదు? వాళ్లకన్నా మేధాసంపత్తి ఉన్నవాళ్లం కాదు. దానివల్ల ప్రయోజనమూ లేదు. ఈ ప్రహేళికలకు సమాధానాలు దొరకవు. మెదడును శ్రమ పెట్టకుండా ఆ పెద్ద సమస్యలవైపు చూడకుండా; ఎందులో సుఖం, ప్రశాంతత దొరుకుతాయో వాటిలో నిమగ్నమయి జీవితం వెళ్లబుచ్చటం ఉత్తమం. అయితే ఇక్కడ ఒక రైడర్‌ ఉంది; అలా ఉండటం సాధ్యపడాలి’’.‘‘దీనికి జీడిపిక్క సిద్ధాంతం అని పేరు పెడితే పోలా?’’‘‘గాడిదకేం తెలుసు. జీడిపిక్కల రుచి? అందులో మీలాంటి బ్యూరిడన్‌జ్‌ ఏస్‌లకి?’’‘‘ఎవరో అన్నట్లు, ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికిపోతే ఆలోచించటానికి ఏం మిగిలి ఉంటుంది?’’‘‘మేధలను వేధించే పారభౌతిక మీమాంస; సర్వజన ఆమోదయోగ్యం కానివే అయినా, సమాధానాలపై శోధన ఆస్తికరమైన వ్యాపకం - జీవితపు నిజమైన వ్యాపకం. అంతేగాక, జీవితాన్ని భరించగలగటానికి మనిషి కళలు, సాహిత్యం, సంగీతం సృష్టించుకున్నాడు’’.‘‘అసలు, నిరంతరానందరావు మానసిక స్థితి ఒక పిచ్చిలాంటిది. చెకోవ్‌ కథ ‘ది బ్లాక్‌ ఫ్రైయర్‌’లో కివ్రిన్‌కు పట్టిన లాంటిది. అతన్ని ఏదైనా చికాకు కలిగించింది ఉంటే అది అంతటి ఆనందం కలుగుతోందేమిటి అన్న భయం. ఆ ఆనందం అతన్ని తలమునకలు చేసి, జీవితపు విసుగుదల, విచారం దరికి రానీదు. అతని చావూ చిరునువ్వుతో ముగుస్తుంది. ‘కాస్త కన్నీరు, మరికాస్త సంతోషపు తేనీరుతో’’ కూడిన బతుకే నయం’’.