కి ఏమీ తోచడం లేదు. ఇల్లు కదలడానికి లేదు. ఇంట్లోనే జైలు శిక్ష.హౌస్‌ అరెస్ట్‌.భార్య మార్జియానా వంటగదిలో ఏదో చేస్తోంది.పిల్లలు ముగ్గురూ సరదాగా ఆడుకుంటున్నారు. కర్ఫ్యూ మూలంగా బడి లేనందుకు వాళ్ళకి సంతోషంగా వుంది.‘‘అరే భాయ్‌! ఈ కర్ఫ్యూ ఒక నెల వుంటే బాగుంటుందిరా, హాయిగా బడికి పోకుండా ఆడుకోవచ్చు’’ అంటున్నాడు రెండో వాడు.మిగిలిన ఇద్దరు పిల్లలూ పగలబడి నవ్వుతున్నారు.‘‘ఛీ... నోర్ముయ్యండి’’ అన్నాడు హసన్‌ కసురుతూ. పిల్లలు భయంగా తండ్రి వంక చూశారు.లోకంలో స్వార్ధం ఎట్లా వెర్రితలలు వేస్తోందో వాడి మాటలవల్ల తెలుసుకోవచ్చు. కర్ఫ్యూ ఎందుకుపెట్టారో, దానికి దారితీసిన సంఘటనలతో వాడికి ప్రమేయం లేదు. ఎవరెట్లా నష్టపోయినా వాడికి పట్టదు. వాడి స్వార్థం వాడిది. కర్ఫ్యూ వుంటే బడికి వెళ్ళక్కర్లేదు. ఎన్ని నెలలైనా ఫరవాలేదు. వాడిలాగే చాలామందికి కర్ఫ్యూ వల్ల ఇబ్బంది లేకపోవచ్చుకాని రోజూ రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు, రిక్షా వాళ్ళు వంటి బడుగు వర్గాల గతేమిటి? చేతిలో పైసాలేని సాధారణ మానవుల పాట్లు ఎవరు పట్టించుకుంటారు?‘‘వెధవ కర్ఫ్యూ... వెధవ మనుషులూ! అంతా స్వార్థంలో కొట్టుకుని పోతున్నారు’’ గొణుక్కున్నాడు హసన్‌.‘‘అబ్బాజాన్‌! రాత్రి బాబా ఇంటికి రాలేదా?’’ ప్రశ్నించాడు పెద్దకొడుకు.షాక్‌ తగిలినట్లు అదిరిపడ్డాడు హసన్‌. కొడుకు అనేవరకూ ఆ విషయమే గుర్తురాలేదు అతనికి.‘‘రాలేదు బేటా’’ అన్నాడు విచారంగా.‘‘ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు?’’ మళ్ళీ ప్రశ్నించాడు.‘‘ఎక్కడున్నాడో? ఒకవేళ ఇంటికి వస్తూ వుండగా దుండగుల చేతుల్లో చిక్కి...’’హసన్‌ గుండె జల్లుమంది, ఆ ఆలోచన రాగానే.

 మనసు మనసులో లేదు. హృదయమంతా ఎవరో ఇనుపచేతితో దేవినట్లయింది. అలా శిలా విగ్రహంలా వుండిపోయాడు చాలాసేపు.పిచ్చెక్కి పోతున్నట్లయింది పిచ్చిపిచ్చి ఆలోచనలతో, మనసు మళ్ళించుకోవడానికి ఏదైనా పుస్తకం చదువుకోవాలనుకున్నాడు. బుక్‌షెల్ఫ్‌లో నుంచి మహాకవి ఇక్బాల్‌ పుస్తకాల్లో తనకు నచ్చినవి ఏరుకున్నాడు. వాటిని టీపాయ్‌ మీద పెట్టుకుని కూర్చున్నాడు.పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు. కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి. కాని విషయం బుర్రకెక్కడం లేదు.కాలం మేకను మింగిన కొండ చిలువలాగ నెమ్మదిగా నడుస్తున్నది.ఇంతలో పక్కింట్లోంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. వీధిలో కలకలం చెలరేగింది.హసన్‌ పుస్తకం మూసి హడావుడిగా తలుపులు తెరిచి వీధిలోకి వెళ్ళాడు. పక్కింటి వారి రెండో అబ్బాయి లతీఫ్‌ శవం అరుగుమీద పెట్టి వుంది. లతీఫ్‌ తల్లి, అక్కచెల్లెళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. అతన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని శాపనార్థాలు పెడుతున్నారు.దూరంగా సి.ఆర్‌.పి. జవాన్లు పరిస్థితుల్ని గమనిస్తున్నారు.హసన్‌ కడుపులో దేవినట్లయింది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లుగా వుంది లతీఫ్‌ శవం. నిన్నటివరకూ ఎన్నెన్నో ఆశలతో జీవించినవాడు ఈ రోజు లేడు. పాపం వాడు బహు సాత్వికుడు. ఎవరి జోలికీ వెళ్ళే వాడు కాదు. పదోక్లాసుతో చదువు చాలించి సైకిల్‌షాపులో పని నేర్చుకుంటున్నాడు.