‘‘ ఈ సంసారాన్ని మరి నేనీదలేను’’ రోజుకు నాలుగుసార్లయినా పార్వతమ్మ అనుకునే మాట. ఇంతకు పూర్వం పైకనేది. ఇప్పుడు తనకు మాత్రమే వినపడేటట్టు అంటోంది. అలవాటు పడ్డాడు కాబట్టి ఆమె హావభావాల్ని బట్టి ఆమె అనుకునే మాటల్ని గ్రహించగలుగుతున్నాడు భర్త కామేశం.ఆమె ఆ మాటల్ని పైకన్నప్పుడు అనేవాడు ‘‘ఇది భావసాగరం పార్వతీ ఈదక తప్పదు’’‘‘మీకేమి మీరెన్ని మాటలైనా చెప్తారు; వాలు కుర్చీలో కూర్చుని పేపరు చదువుతు నాలుగుసార్లు కాఫీ త్రాగుతూ. ఉదయం నాలుగు గంటలనుండి గానుగెద్దులా రాత్రి పదకొండు వరకు, విశ్రాంతి లేకుండా, వంచిన నడుము ఎత్తడానికి కూడా నోచుకోకుండ నే పడుతున్న యాతనలు ఎవరికి తెలుస్తాయి? దేనికైనా హద్దు ఉంటుంది అంటారు. నా విషయంలో అది కనపడటం లేదు. కోడల్నీ అనడానికి వీల్లేదు. పిల్లల్ని భర్తని నిద్రలేపి వాళ్ళ అవసరాలు చూసి వాళ్ళని బయట పంపడానికే దానికి టైము సరిపోవటం లేదు. ఇక అమ్మాయి ఉందంటే - ఎంతసేపు దానికి కంప్యూటరు, సెల్లు, చదువంటు మోపెడ్‌ వేసుకుని అటు యిటు తిరగడానికే సరిపోతుంది. పైగా దాని అవసరాలన్నీ నేనే చూడాలి. అదెక్కడ, ఇదెక్కడ అని అరుస్తుంది. అప్పుడే అది ఇంజనీరైపోయినట్టు. నాకు వంటిల్లే పుస్తయిపోయింది. ఓ గుడీ లేదు. ఓ గోపురం లేదు...’’ ఇలా ఆమె మాటలు సాగుతూంటే; అర్థం చేసుకున్న కామేశం ‘‘కూరలు తరిగిపెట్టనా? పాలు మరగబెట్టనా! ఇంకా ఏమైనా పనులుంటే చెప్పు’’ అనేవాడు.‘‘వద్దు స్వామీ. మీరేం చేయొద్దు. పురుగులు, పుచ్చులు చూడక కూరలు తరిగేస్తారు.

 పాలు పొంగి పోయేంత వరకూ మీకా ధ్యాసే ఉండదు. తిరిగి అవన్నీ నే చూసుకోవాలి. అయినా ఇంతమంది ఆడవాళ్లున్నప్పుడు మీకా పనులెందుకు’’ కోడల్ని, కూతుర్నీ, అంటోందని అతనికి తెలుసు. చెప్పినా వాళ్లు చేయరనీ తెలుసు. అయినా ‘అమ్మకి పనుల్లో కాస్త సాయం చేయరాదుటే’ అంటాడు కూతురు సుమతో. ‘‘నాకవదండి నాన్నగారు. నాకసలే బోలెడు కాలేజి వర్కుంది. ఆవిడగారికి చెప్పి చేయించు కోమనండి. టీ.వీ. చూడ్డం, పుస్తకాలు చదవడం తప్ప ఆవిడగారు చేసే పనులేమున్నాయట’’ అంటుంది నిర్మొహమాటంగా.ఇక ఆమె స్నానానికి లేచి, కాలేజీకి వెళ్లేంతవరకు అన్నీ అందిస్తూ, సణుగుడు భరిస్తూ వంటింటికి, కూతురు గదికి పరుగులు వేయాల్సిందే. ఏది తక్కువైనా కథాకళి నాట్యం చేస్తుంది.కోడలు రాజేశ్వరి పనుల్లో కలుగజేసుకోదుగాని ‘‘మీరు సుమని మరీ ముద్దు చేస్తున్నారు అత్తయ్య! పెళ్లయి అత్తవారింట కెళ్లాల్సిన పిల్ల పెరిగే దలాగేనా?’’ అని అంటుంది. ఈ మాటల్ని సుమగాని విన్నదంటే ఆ రోజు ఆ యింట్లో భీకర యుద్ధమే. కూతుర్నేమనలేదు. కోడల్నీ ఏమనలేదు. ఆమె తన తమ్ముడి కూతురు. పైగా తల్లి లేనిది. సుమ లేనప్పుడు పార్వతమ్మ అంటుంది, ‘‘ఒక వయసు వచ్చిన తరువాత ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి’’ అని.