ఆకుమడిలో దమ్ముచేస్తోన్న చక్రయ్య ఒంటి మీంచి ఘర్మజలం ధారలుగా కారుతూ భూమిని అభిషేకిస్తోంది.తపస్సు చేస్తున్న ఋషిలా దీక్షగా మడి తొక్కుతున్నాడు. ఎలాంటి ముద్దలూ రాళ్ళూ వుండకుండా సమంగా వుండేలా చదును చేస్తున్నాడు.ఎంతచక్కగా దమ్ముచేస్తే నాటిన విత్తనం మొలకెత్తడానికి అంత అనువుగా వుంటుంది. వరిమొక్క పచ్చగా బలంగా వుంటే ఎన్నో కంకుల్ని వేస్తుంది. ఆ కంకులను కాసే గింజలే రైతుల బతుకు. కష్టం. ఫలం. భవిష్యత్తు. అన్నీను.‘‘ఏంటి మావా అప్పుడే దమ్ము చేసేస్తున్నావు విత్తనాలింకా మార్కెట్లోకి రాలేదు గదా’’ పశువుల్ని తోలుకెళ్తున్న ఇంకో రైతు అన్నాడు.‘‘ఇవాళో రేపో వస్తాయంట. నారాయన చెప్పేడ్రా అబ్బాయ్‌. మళ్ళీ కాలవ కట్టేత్తే కస్టవని ముందుగానే దమ్ము సేసేత్తన్నా..’‘‘దాల్వాకి దెబ్బతిన్నావు. ఈ సారాన్నా జాగర్తపడు మావా’’.‘‘భూవినీ ఆకాశాన్నీ నమ్ముకున్నోళ్ళం. ఆరుగాలం కస్టపట్టం తప్ప ఇంకేం సెయ్యగలంరా. ఆ దొంగ నా కొడుకు నాసిరకం విత్తనాలు అంటగట్టాడు. మొలకెత్తనే లేదు. పూరాగా అన్యాయం అయిపోయాన్రా. అదను తప్పి పోతాందని నిన్నూ నిన్నూ బతిమాలి నాలుగు రకాలు తెచ్చి వూడ్చాను. ప్చ్‌.... కస్టం దక్కలేదు. బాకీలు కొండలా మిగిలి పోయాయియి...!’’చక్రయ్య స్వరం గాద్గదికమయ్యింది.‘‘అందరిపనీ అట్లాగే వుందిలే మావా. నువ్వు పైకి చెబుతున్నావు. మేం చెప్పట్లేదు. అంతే తేడా’’.అతడెళ్లి పోయాడు.

దమ్ము సంతృప్తికరంగా అయ్యింది. ఎంతో సంబరంగా అన్పించింది. మడిలోంచి వచ్చి ప్రక్కనే వున్న చెరువులో కాళ్ళూ చేతులూ కడుక్కున్నాడు.‘విత్తనాలు కొనడానికి డబ్బు ఎక్కడ పుడుతుందా’ అన ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు.పీట వాల్చి అన్నం వడ్డించి ఆ ప్రక్కనే చతికిలబడింది భార్య రత్తమ్మ.అన్యమనస్కంగా తింటున్నాడు చక్రయ్య.‘‘శ్రావణంలో పిల్ల పెళ్లి చెయ్యాలి’’ మెల్లగా అంది.‘‘చూద్దాం లేవే’’‘‘చూద్దాం చేద్దాం అంటేకాదు ఆలీసం సేత్తే బయటికెళ్లి పోయేట్టున్నాడు మా అన్నయ్య...’’‘‘పోతే పోనివ్వే. కాలూ చెయ్యి కూడదీసుకోలేక నేను ఛస్తావుంటే పిల్లా పెళ్ళీ నా శ్రాద్ధం అంటావేంటే ఎర్రిమొగమా!’’ కయ్‌మన్నాడు.‘‘ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు ఎవరి మీదో కోపం నా మీద సూపిత్తావేంటి?!’‘‘నాకు కోపం ఏంటే. పేదోడి కోపం పెదవికి సేటన్నారు. నాది కోపం కాదే బాధ. దుక్కం. విత్తనాలకి డబ్బు సర్దుబాటయ్యేలా లేదు. పుస్తెల తాడూ తాటక్టు కెళ్ళిపోయింది. ఏం సేయాలో ఎలా సావాలో తెలీటం లేదే’.‘‘ఇంటి కప్పు కింద కూకొని అవేం మాటలు! నారు పోసినోడు నీరు పోయక పోళ్లే’’ కంచంలో మజ్జిగ పోస్తూ అంది.‘‘కాలం మునుపట్లా లేదే. సొసైటీ వుంటే ఏదో రకం తిరిగేది. దాన్ని దివాలా ఎత్తించేసేరు. బ్యాంకోళ్ళ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళనెప్పులు తెచ్చుకోడమేఁగాని అప్పు పుట్టదు. ఎలా బతకాలో ఏవో!’’ నిట్టూరుస్తూ లేచాడు.