‘‘ఒంటరి ఆడది’’ఆ మాట చెప్పేసి మౌనంగా కూర్చున్నాడు ప్రవీణ్‌.కిరణ్‌, రాజా మొహాలు చూసుకున్నారు. ఎవరు ముందు మొదలుపెట్టాలి అన్నట్లు.ఈ మధ్య కిరణ్‌ రాసిన ఒక కథకి పాతిక వేల రూపాయల బహుమతి వచ్చింది. స్నేహితులు పార్టీ అన్నారు. సరే సాయంత్రం కలుసుకుందాం అనుకున్నారు. కలుసుకున్నారు. మందు సేవిస్తూ మాటల్లో పడ్డారు.‘‘తర్వాతి కథ ఏం రాయబోతున్నావురా?’’ అన్నాడు రాజా.ప్రవీణ్‌ నవ్వాడు. హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లు ‘‘నేనొక మాట చెప్తాను. అది వినగానే మీకేమనిపించిందో చెప్పాలి’’ అన్నాడు.‘‘అంటే?’’ అన్నారు ఇద్దరూ.‘‘తర్వాతి కథకు వస్తువు అదే’’ అన్నాడు ప్రవీణ్‌ వాళ్ళ వైపు పరీక్షగా చూస్తూ. ‘‘ఆ మాట వినగానే మీకు కళ్ళ ముందు ఎవరు కనిపించారు? మనసులో ఎవరు మెదిలారు? వాళ్ళ గురించి చెప్పండి’’ అన్నాడు.వాళ్ళకది అలవాటే. ఏదన్నా సమాచారం కావాలంటే ప్రవీణ్‌ ఆ ప్రశ్నని నేరుగా అడగడు. ఇంకేదో అడుగుతాడు. ఏదేదో మాట్లాడిస్తాడు. చర్చలు పెడతాడు. దానిలో నుంచి చివరికి తనకి కావలసిన సారం లాక్కుంటాడు.ఇంకా నయం ఈసారి ఇది కథ కోసం అని ముందుగా ఒక మాటన్నా చెప్పాడు. మామూలుగా అయితే అదీ చెప్పడు.ఒక విషయంపై అభిప్రాయం చెప్పండి అని అడిగితే అవతలి వాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయం ఎంత పేలవంగా ఉంటుందో, అసంపూర్ణంగా ఉంటుందో ప్రవీణ్‌కి తెలుసు. అలాంటి సమాచారం అంతర్జాలంలోను, పుస్తకాలలోను వెతికినా దొరుకుతుంది.ఒక విషయం చుట్టూ మనుషుల మనసుల పొరల్లో వాళ్ళకే తెలియకుండా ఉన్న సమాచారాన్ని లాగాలంటే... దానికి కొన్ని మెళకువలు కావాలి. అవి తనకు బాగా తెలుసునని ప్రవీణ్‌ నమ్మకం. కొంతవరకూ అది నిజం కూడా.

‘‘నువ్వెవరిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నావు?’’ ప్రశ్నించాడు కిరణ్‌.‘‘నా దృష్టిలో ఎవరూ లేరు’’ అని ప్రవీణ్‌ చెప్పబోతుండగా అతని ఫోన్‌ మోగింది.అరుణ. ‘‘తర్వాత మాట్లాడతాను’’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ తర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేసేశాడు.మనసును మళ్ళీ ప్రస్తుతంలోకి తీసుకువస్తుంటే కిరణ్‌ అంతకుముందు ఏమడిగాడో గుర్తొచ్చి ప్రవీణ్‌కి నవ్వొచ్చింది. కిరణ్‌ ఆ ప్రశ్న అడిగిన క్షణంలోనే అరుణ ఫోన్‌ చేయడం! ఇది యాదృచ్ఛికమా! లేక ఇలాంటి వాటికి ఏదైనా కారణం ఉంటుందా! అవును, తను ఆ ప్రశ్న అడగడానికి కారణం అరుణే. అరుణతో తనకి పెళ్ళయి ఇరవై ఏళ్ళు. ఎలాంటి మనిషినయినా నిమిషాలలో అర్థం చేసుకోగలను అనుకునే తనకి అరుణ ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. తన జీవితంలోకి వచ్చినపుడు ఆమె వయస్సు ఇరవై ఏళ్ళు. ఇప్పుడు నలభై ఏళ్ళు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే గాంభీర్యం.