‘‘ఇట్లా ఎంతసేపని ఊరికే పైకి చూస్తూ పడుకోవడం? చాలా అసౌకర్యంగా ఉంది’’ అనుకుని కష్టం మీద పక్కకు తిరిగి పడుకున్నాడు అనంతరామయ్య.‘ఇప్పుడు బాగుంది. కొంచెం నయం’ అని అనుకున్నాడు.‘కదలకుండా పడుకోండి’ అని అనవసరపు ఆలోచనలు పెట్టుకోకుండా కళ్లు మూసుకొని నిద్రపట్టించుకోండి అని సలహాలు... వినీవిని విసుగుపుట్టింది.కదలకుండా ఉండగలగడమే కష్టం... పైగా ఆలోచించకుండా ఎలా ఉండడం? ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి? అదీగాక జ్ఞాపకాలంటూ కొన్ని ఉంటాయి. ఏళ్ల తరబడి ఎక్కడో మన మనసులో మారుమూల దాగి ఉండి అప్పుడప్పుడు పైకి తేలుతుంటాయి. మంచి జ్ఞాపకాలయితే మురిపించేవి, బాధకరమైన జ్ఞాపకాలయితే బాధించేవి అనేకం ఉంటాయి. వాటిలో చాలా భాగం ఇంత జీవితం గడిచాక లుప్తమై నశించిపోతాయి కూడా.ఇంత కాలం గడిచిపోయింది. ఇంత నీరు వంతెన క్రింద ప్రవహించి పోయింది. ఒకప్పటి శక్తీ, చావా ఇప్పుడు లేవు, నెమ్మదిగా స్మృతి కూడా మందగిస్తున్నది. శరీరంలో కదలికలు తగ్గి తన దేహమే తనకు కొంచెంకొంచెంగా బరువనిపిస్తున్నది.ఊహతెలిసే నాటికి ఉరకలు వేసే బాల్యం. ఆ ఆటలు...ఆ పాటలు అన్నీ తెరమీది బొమ్మల వలె కనుమరుగైపోయాయి. ఆనాటి జ్ఞాపకాలన్నీ కరిగిపోగా నేటికీ ఒక్కటిమాత్రం నిలిచి ఉంది... ఆ అన్నదమ్ములిద్దరూ కవలలు. రాముడు లక్ష్మణుడి కంటే రెండు నిమిషాలు పెద్ద అంతే.. పేద తల్లిదండ్రుల కంటిపాపలు.. వారిలో రాముడు తమ కళ్లముందు నీళ్లలో కొట్టుకుపోయాడు.తోటి పిల్లలు ప్రవాహంలో, వాగులో కొట్టుకుపోతూ ఉంటే వారిని ప్రవాహపు ఉధృతి నుంచి ఒడ్డుకు చేర్చి కాపాడి తాను మాత్రం జాడలేకుండా కనుమరుగై పోయాడు. తాము నలుగురూ ఒడ్డున నిలబడి కేకలు వేయడం తప్ప ఏమీ చేయలేక పోయారు. ఆ ప్రవాహంలో దూరదూరంగా ఏదో అదృశ్య రాక్షసహస్తం ఈడ్చుకు పోతున్నట్టు వెళ్లిపోతూ చేతులెత్తి అరుస్తూ మాయమైపోయిన దృశ్యం ఇప్పటికీ మనసులో లోపలి పొరల్లో దాగి ఉండి అప్పుడప్పుడూ పైకి తేలి బాధిస్తూ ఉంటుంది. తర్వాత ఆ కుటుంబం ఎటు వెళ్లిపోయింది. లక్ష్మణుడేమైనాడో తెలియదు. వాడైనా పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండి ఉంటాడా? ఏమో!.. ఆ తర్వాత అరవైఅయిదేళ్లు గడిచిపోయాయి. 

తన చదువు సంధ్యలు ఉద్యోగం కోసం ఆరాటం...వెదుకులాటలు... వెదికి వెదికి వేసారిన తర్వాత ఒక మోస్తరు ఉద్యోగం... అందులో బరువులు...బాధ్యతలు... పెళ్ళి....పిల్లలు...ఇలా ఇంత జీవితమూ గడిచిపోయింది. చాలా మామూలుగా...సాదాసీదాగా...మొత్తం మీద అమిత డల్‌ గా...నీరసంగా నిస్తేజంగా.. చిన్న చిన్న ఆనందాలు... చిన్న చిన్న థ్రిల్స్‌... చిన్న చిన్న బాధలు..కొంచెం కన్నీరు..ఇలా...అంతకాలం తన నీడగా తోడుగా తన జీవితంలో పాలుపంచుకున్న భార్య అతి సామాన్య కుటుంబంలో నుంచి ముగ్గురు ఆడపిల్లల చివరిదానిగా తల్లిదండ్రులు పెళ్లి చేసి ‘హమ్మయ్య... గుండెలమీద కుంపటిని దింపుకున్నాం’ అని నిట్టూరుస్తూ వొదిలించుకోగా తనకు జీవన సహచరిగా వచ్చిన అతి సామాన్య స్త్రీ. తనను అలరించి ఉన్నంతలో జాగ్రత్తలు పాటించి సంసార నౌకను జీవిత సముద్రంలో ఒడిదుడుకుల పాలు కాకుండా నడిపించిన ఉత్తమ ఇల్లాలు. ఆమె కన్ను మూయడం తనకు ఈ వృద్ధాప్య దశలో ఘోరమైన కష్టమే. అదొక దుర్ఘటన... మామూలు జ్వరం అన్నారు. మామూలు మందులకు తగ్గలేదు. మందులు వాడే కొద్దీ పరిస్థితి జటిలంగా మారింది. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లవలిసి వచ్చింది. ‘ఐ సి యు’ అన్నారు. ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు. ఎవరినీ చూడనివ్వలేదు. ఎవరినీ మాట్లాడనివ్వలేదు. ఆరోగ్యపరిస్థితి ఎట్లా ఉందో ఒక్కమాటైనా చెప్పలేదు. అంతా నిశ్శబ్దమే...ఇరవై రోజులు లోపల ఉంచి వేలకు వేలు గుంజి ఇరవై ఒకటో రోజున తీసుకెళ్లమన్నారు.