‘‘మా నాయిన పరిస్థితి అప్పట్నించి కూడా తేరుకోలేదనా... ఆస్పత్రిలన్నీ తిరిగి తిరిగి శానా డబ్బులు పోశాం. మంత్రాలని, తంత్రాలని... దేవర్లనీ...దెయ్యాలనీ నువ్‌ చెప్పిందల్లా చేస్తానే వుండాం. ప్చ్‌... ఏం లాభం లేదు... గుండమాల నుంచి వచ్చిన కొక్కిల గడ్డ కోటేశ్వరరావు పెద్ద కొడుకు కొత్తపట్నం హాస్పిటల్‌ దగ్గర కలిసినపడు వాళ్ల నాన్న ప్రస్తావన తెచ్చాడు.‘‘ఏమయ్యింది? ఎలా వున్నాడు?’’‘‘మా ఊరోడే చాతబడి చేయించినాడంట’’‘‘చాతబడి, బాణామతి ఎక్కడున్నాయయ్యా! ఎందుకలాంటి చాదస్తాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటారు.’’‘‘లేదు...లేదనా! దాని మీద పెద్ద యవ్వారం జరిగి పోలీసుకేసుదాక్కూడా పోయినాయి... వాయిదాలకు తిరగతాండాం...చేసినోడే ఒపకున్నాడనా’’‘‘మీరంతా ఒక్కసారే దాడికొచ్చేసరికి భయపడి ఒపకొనుండొచ్చుగదా!’’‘‘పస్తీ కెళ్లినా ఆడిపేరే వచ్చింది’’‘‘పస్తీలో (ప్రశ్న) ఫలానా మనిషని పేరు చెప్పారా? లేదు కదా! ఆ మనిషి మీద అనుమానం పెట్టుకుని పస్తీ అడిగారు. వాడు పది విషయాలుచెబితే మీరు అనుమానించిన వ్యక్తిలో నాలుగైదు లక్షణాలుకనిపించాయి. దాంతో అతనే చేసుంటాడని అంతా కలిసి గొడవకు పోయారు అంతేనా?డాక్టరుగారు అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక ‘మా పెద్దోళ్లంతా ఆడే చేసుంటారంటున్నారనా ఎట్టవుద్దో ఏమో! అంటూ బయటకి వెళ్లిపోయాడు.రెండు మాసాల క్రితం ఒక అర్ధరాత్రి సమయంలో నలుగురు మనుషులు కోటేశ్వర్రావును జీపులో కొత్తపట్నం హాస్పిటలుకు తీసుకొచ్చినపడు చాలా ఆందోళనకరంగాకనిపించాడు.

‘‘మంటలు...మంటలు...అమ్మో నే బతకను అయ్యో’’ కేకలేస్తూ మంచం మీద అటూ ఇటూ పొర్లాడుతున్నాడు.శరీరమంతా పసుపు పూసి వుంది. మెడలో తాయత్తులు, మంత్రించిన దారాలూ, మెడపై వ్రేలాడుతున్న గుడ్డ పీలిక (దురాయి) నుదిటిపై విభూది రేకల మధ్యన కొలువు తీరిన కుంకుమ బొట్టు, పెరిగిన గడ్డం, మాసిన తలజుట్టుతో క్షుద్ర దేవత బలికి సిద్ధం చేసిన జంతువులా అరుస్తూ ఊగిపోతున్నాడు. వాడిన ఆటలమ్మ మచ్చలతో స్నాన సంస్కారం లేక వళ్లంతా ఒక విధమైన వాసనవేస్తోంది.‘‘ఏమయ్యింది’’ రోగిని తీసుకొచ్చినవారినడిగాడు డాక్టరు.‘‘తల్లి పోసి రెండు వారాలయిందయా. ఒళ్లంతా పచ్చిరెడమయిపోయింది. నోరూ అంగిలి పూసిపోయి...గుటక మింగాలంటే అల్లాడిపోతుండాడు. మొన్నయితే కళ్లు మరీ చింత నిపల్లా వుండేయి. నాలుగు దినాల నుంచి మరీ కోడికీ మాకు తెల్లార్తుంది. కూకోలేకపోతున్నాడు. పడుకోలేకపోతున్నాడు. ఇదే జాతర. సూదో...బిల్లో యేద్దామంటే చుట్టుపక్కలోళ్లు తల్లిపోస్తే ఎట్టెస్తారు అని ఎయినీక పోతుండ్రి. ఆయన బాధ చూడలేక ఎట్టయితే అట్టవుద్దని ఆస్పత్రికి తీసుకొచ్చాం. ముద్దనోట్లోకి పోతే చాలు ఒకటే...వాంతి...కడుపులోకి ఏమీ సొరక్క నీరసమయిపోతుండు. చూడ్లేక పోతుండాం. ముందా బాధ తగ్గే మార్గం చూడయ్యా’’ వివరాలు చెబుతూనే ఇవతలకొచ్చి మొల మీద పంచె సర్ది కాళ్ల దగ్గర దిగాలుగా నిలబడింది. కోటేశ్వర్రావు భార్య తిరుపతమ్మ.