శ్రీరాముడు పై ప్రాకారం మీదకి వంటరిగా వెళ్ళి ఒక్కసారిఅయోధ్యా నగరాన్ని పరిశీలనగా చూశాడు. మేడలు, మిద్దెలు,వాకిళ్ళు, లోగిళ్ళు, వాటిని అలంకరించటంలో జనమంతా హడావిడిగా కదులుతున్నారు చిన్న చిన్న ఆకారాలుగా. అలా చూస్తుంటే కదులుతున్న బొమ్మల కొలువులా అనిపిస్తోంది. ఇంత అకస్మాత్తుగా తన పట్టాభిషేకం తండ్రిగారు నిర్ణయించటం శ్రీరాముడికి ఏమంత ఆనందదాయకంగాలేదు. తెలియని నిర్లిప్తత మనసులో చోటు చేసుకుని, కాస్తంత గుబులుగానే వుంది.భరత శతృఘ్నలు లేరు. అది లోటుగా వుంది. నాన్నగారు వారిని పిలిపిస్తానన్నారు. కానీ అది సత్వరం జరిగి వారు సమయానికి రాగలిగితే మంచిదే.- లేకుంటే?- ఎందుకీ తొందర అనిపిస్తోంది. అతని ఆలోచనల్లో ఒక్కొక్కరూ మెదిలి కదులుతున్నారు. కైకేయి దగ్గర అతని ఆలోచన ఆగింది. ఈ సంగతి తనే స్వయంగా వెళ్ళి పిన్నికి చెప్పి, భరతుడ్ని వెంటనే రప్పించే ఏర్పాటు చేయమని అభ్యర్థిస్తే కార్య సాధన వెంటనే జరుగుతుంది.

కైకేయి పిన్ని చాలా తెలివైనది. చురుకైనది. విషయం గ్రహించటంలో ఆమెకు లిప్తకాలం చాలు. నాన్నగారు చేసే జాప్యం కూడా వుండదు. తనంటే ఎంతో ప్రేమించే పిన్ని తనే స్వయంగా వెళ్ళి ఈ పట్టాభిషేక వార్త చెప్తే ఎంత ఆనంద పడుతుందో?తండ్రి కంటే చాలా చిన్న వయసున్న పిన్ని ఆయనకి మూడో భార్యగా రావడం రాముడ్ని ఎప్పుడూ ఆలోచింపచేస్తుంది. ఆమెకెన్నో నైపు ణ్యాలున్నాయి. సౌందర్యవతి, బుద్ధి కుశలత గలది. వీలువిద్యా ప్రావీణ్యురాలు -ఇన్నీ వుండి ఆమె తండ్రిగారిలో ఏమిచూసి వలచి భార్య అయింది?- ఆయనొక మహారాజు - అంతే చిన్న తనం నుంచీ రాముడ్ని ఎంతో గారంగా, ముద్దు చేసి, ప్రేమించి గోరుముద్దలు తినిపించి పెంచిన తల్లి కైకేయి. ఆమె ప్రేమలో అతను తల్లినే చూశాడు గానీ పినతల్లిని చూడలేదు. ఆమె దగ్గర అతనికున్న చనువు అంతా యింతాకాదు. ముందు వర్తమానాలు, అనుజ్ఞలు లేకుండానే ఎప్పుడూ కైకమందిరాని వెళ్ళి వస్తూంటాడు రాముడు. ఊహమాత్రంగానే అతను కైకేయి మందిరం వైపు కదిలాడు.లోపలికి అడుగుపెట్టి ద్వారం ముందే అగాడు. గొంతు బిగ్గరగా చీలుకుపోతూ వినిపి స్తోంది. అటువంటి కంఠస్వరం అతనెప్పుడూ విని వుండలేదు. అది తండ్రి కంఠమని గ్రహిం చాక మరీ విస్మయం కలిగింది. అతని అడుగు అసంక ల్పితంగా వెనక్కిపడి ఆగిపోయింది.‘‘ఓసీ! పాతకీ ! - ఈ బుద్ధి నీకే పుట్టిందా? లేకపోతే ఎవరైనా ఈ వక్రమార్గాన్ని సూచిం చారా?’’ దశరథుని గొంతు దుఃఖంతో కోపంతో వణుకుతోంది.‘‘అనవసరంగా నోరు పారేసుకోకండి. అరవ కండి. ఒకరు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను సొంతంగా ఆలోచించగలను. సొంతంగా నిర్ణ యించుకోగలను. అనుకున్నది సాధించు కోగలను’’ ఆమె గొంతు స్ధిరంగా, దృఢంగా వుంది.