‘‘సారీ నాన్నా!’’ఈ రోజు ఎన్నోసారో తెలీదు గాని మూడేళ్ల క్రితం వాడి అమెరికా ప్రయాణం ఖరారైన నాటి నుంచి వాడికిది చెప్పడం అలవాటయిపోయింది. నేను ఒంటరి జీవితానికి సిద్ధమవ్వాలన్న సంగతి నాకు ఆనాడే తెలిసిపోయింది.నేను రిటైరయిన రెండేళ్లకి ఇంట్లో నేనూ మా ఆవిడే మిగిలాం. విదేశాలకు వెళ్లాలనే నా ఒకప్పటి కోరిక వీడి ద్వారా నెరవేరినందుకు నేను ఆనందించేను. మా ఆవిడ మాత్రం కృంగిపోయింది. ఆ బెంగతోనే మరో రెండేళ్లలో కాలం చేసింది. నా జీవితం మరీ ఒంటరిదయిపోయింది.అమెరికా నుంచి తరచూ వచ్చే కాల్స్‌, ఇంట్లో టెలివిజన్‌ తప్పించి మరొక వ్యాపకం లేకపోయింది. నన్ను తనతో పాటు అమెరికా తీసుకెళ్లడానికి వాడు చేయని ప్రయత్నమంటూ లేదు. విజిటర్స్‌ వీసాపై ఏడాదికి ఆరు నెలలు వాడితో వుండే అవకాశంకోసం ముందు ప్రయత్నించాం.కానీ వెళ్లి వున్న మొదటిసారే నేనక్కడ ఇమడలేకపోయాను. భారతదేశంలోని ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం అమెరికాలో గృహనిర్భంధాన్ని అనుభవిస్తున్నాను అనిపించింది. మరి వెళ్లలేదు.మరో ఏడాదికి వాడు అక్కడే ప్రేమించిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. సరేనన్నాను. క్రమంగా వాడు నా నుంచి దూరమయ్యాడు.

ఇందులో ఏదీ, ఎంతవరకు, ఎవరి తప? అంతా సహజంగానే జరిగిపోయింది. నా గురించి వాడిని ఇక్కడే భారతదేశంలోనే ఉద్యోగం చూసుకోమనవలసిన అవసరం నాకు కనిపించలేదు.అది స్వార్థమనిపించింది.నా ఈ ఆలోచనల వెనుక మరొక బలమైన కారణం వాడికి నాకు మధ్య వున్న నమ్మకం మైళ్ల కొద్దీ మా మధ్య విస్తరించిన దూరం మా మధ్యన మానసికమైన ఏ దూరాన్నీ ఏర్పర్చలేదు. అదే ఆప్యాయత, అభిమానమూ గత ఏడాదికి వరుసగా జరిగిన వృద్ధుల హత్యలు నా జీవితాన్ని మళ్లీ మలుపు తిప్పేయి. విదేశాల్లో పిల్లలు స్థిరపడగా ఇక్కడ ఒంటరిగా వుంటున్న వృద్ధులను దోచుకోవడమూ, ఆ ప్రయత్నంలో భాగంగా చంపడానికి కూడా వెనుకాడని రెండు మూడు ఉదంతాలు మావాడిలో కలవరం కలిగించాయి.ప్రతిరోజు ఫోన్‌ చేసేవాడు. వాడు, కోడలు ‘అమెరికా వచ్చేయమనేవారు’ అయితే ఆర్నెల్లకి లభించే సెక్యూరిటీని నేను సీరియస్‌గా పట్టించుకోలేదు.దురదృష్టవశాత్తు నా ఇంట్లోనే దొంగతనం జరిగింది. నేను ఏమాత్రమూ ప్రతిఘటించక పోయినా వాళ్ల జాగ్రత్త కోసం నన్ను కొట్టేరు. అది నాకు పెద్ద షాక్‌.కొడుకు, కోడలు సెలవు పెట్టుకొని వచ్చేరు. వాళ్ల మధ్యన గడిపిన క్షణాలు నన్ను త్వరగా కోలుకునేలా చేసేయి. ఆ రెండు నెలల పాటు జరిగిన తర్జనభర్జనలలో చివరికి నేనలా వంటరిగా వుండే బదులు వృద్ధాశ్రమంలో వుండడం అన్ని విధాలా మంచిదని తేల్చేం. వాడు, కోడలు క లిసి హైదరాబాద్‌ మొత్తాన్ని గాలించేరు. చివరికి ఈ ఆశ్రమాన్ని ఎంచాం.