సాంబయ్యా! నువ్వు అటేపు చూడు. ఈ కంపార్ట్‌మెంట్‌లో నేను చూస్తాను’’ హడావిడిగా కంపార్ట్‌మెంట్‌ దగ్గరికి పరిగెత్తుకెళ్లింది స్వప్న.‘‘కంగారు పడకమ్మా. చిన బాబుగారు నాకు గుర్తేకదా’’ ధైర్యం చెప్పాడు సాంబయ్య.ఆ పల్లెటూర్లో ఆగే ఒకే ఒక ఎక్స్‌ప్రెస్‌ అది. అందులోంచి దిగిన ఆరుగురిలో ఫ్యాన్సీ డ్రస్‌లాంటి దుస్తుల్లో వున్న వినీత్‌ని చూసి విస్తుపోయింది స్వప్న.‘‘ఏంట్రా అన్నయ్యా.. ఈ బుడబుక్కల వేషం ఏమిటి? జులపాల జుట్టు, మధ్య పాపటి, మీసం లేకుండా ఒంటిచెవు పోగు పైగా గతిలేని ముష్టాడిలాగా మోకాళ్ళ దగ్గర చిరిగిన జీన్సు ప్యాంటు. పైగా వెలిసిపోయిన ఈ చేతుల్లేని చొక్కా? మన వూర్లో ఇలా తిరిగావంటే వీధికుక్కలు వెంటపడతాయి’’ వివరించింది.‘‘లుక్‌ స్వప్నా! నేను వచ్చింది అమెరికానుంచి, అంగల కుదురునుంచి కాదు. ఇది లేటెస్ట్‌ ట్రెండ్‌. నువ్వేమో బైతులా ఈ పల్లెలోనే పెరిగావు. నాన్న పుణ్యమా అని, ఎంతగా అమ్మ అడ్డుపెట్టినా ఫారిన్‌ వెళ్ళగలిగాను. అది సరేలే, అమ్మా నాన్న ఎలా వున్నారు? కనీసం టాక్సీ తెప్పించి పంపొచ్చుగా?’’ చిరాగ్గా అడిగాడు వినీత్‌.

‘‘అరే అన్నయ్యా! నీకంత సీన్‌ లేదు గాని, ఈ డీలక్స్‌ రెండెడ్ల బండితో సర్దుకుపో. అంత బావుంటే, ఈ మారు నువ్వు వచ్చేసరికి కనీసం సెకండ్‌హాండ్‌ అంబాసిడర్‌ కారైనా తెప్పిస్తాను’’ అంది స్వప్న టీజింగ్‌గా.‘‘స్వప్నమ్మ! అన్నయ్యగారిని ఏడిపించడం ఇక చాలు. నడిజాములోపు జాగ్రత్తగా ఇంటికిచేరుస్తాగా’’ అన్నాడు సాంబయ్య.‘‘రేయ్‌ వినీత్‌! నాకో సాయం చెయ్యాలిరా’’ అన్నారు సాంబమూర్తిగారు, తాంబూలం వేసుకుంటూ.‘‘డాడీ.. ఏంటది’’ స్టైల్‌గా అడిగాడు.‘‘ ఏమీ లేదురా, నువ్వు తల దువ్వుకునేటపడు చిన్న పిచ్చుక పిల్ల ఏమైనా దొరికితే, మర్చిపోకుండా ఇవ్వరా’’ క్యాజువల్‌గా అడిగారు మూర్తిగారు.‘‘డాడ్‌, మీరు నన్ను ఇలా అనుమానించడం ఏం బాలేదు’’ కసిగా అన్నాడు వినీత్‌.‘‘నీ తెలుగు తగలెయ్య. అది అనుమానించడం కాదు, అవమానించడం’’ కరెక్ట్‌ చేశారు మూర్తి.‘‘అన్నయ్యా! అమెరికాలో చప్పిడి తిండి తిని నోరు చవి చెడిపోయి వుంటుంది. కాసంత ఈ ఆవకాయ కలుపుకోరా’’ అంటూ కొత్తగా పెట్టిన ఆవకాయ వేసింది స్వప్న.అంతదాకా పిజ్జాలూ, బర్గర్లూ తినడానికి అలవాటుపడ్డ వినీత్‌కు మన వంటలన్నా, రుచులన్నా కాస్త చిన్నచూపు. ఇదంతా ‘ఎర్రబస్సు’ టేస్టని అతని భావన.అదే కేర్‌లెస్‌తో ఏమాత్రం చూసుకోకుండా కూర కలుపుకున్నంతలా, ఎర్రగా కలుపుకున్నాడు. మొదటి ముద్దను తన నోట్లో పెట్టుకోవడం ఆలస్యం వినీత్‌ పెట్టిన కేకకు వీధిలో ఎడ్లను కడుగుతున్న సాంబయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు కంగారుగా.కంట్లో నీళ్లు, ముక్కుల్లో ఆవిర్లు వస్తుండగా ఎంగిలిచేత్తోనే బాటిల్‌ ఎత్తుకుని గడగడా తాగేశాడు. మామూలు స్థాయికి రావడానికి గంట పట్టింది.