‘అయ్యో రామా! ఏమిటీ దౌర్భాగ్యం. రోజూ ఏ పేపర్‌లో చూసినా కుంభకోణాలు, చావు వార్తలే తప్ప జనానికి ఉపయోగపడే అంశాలేమైనా వున్నాయా? చదవడం మానేస్తే సరి.’పేపర్‌ మడిచి గిరాటేసే చివరి క్షణంలో ఆశారాజు దృష్టిలో పడిందో ప్రకటన. కారుచీకటిలో కాంతిరేఖ మెరిసినట్లయింది. జాగ్రత్తగా దానిని చదివాడు. మొహం స్టేడియంలోని ఫ్లడ్‌లైట్‌లా మెరిసిపోయింది. అంతలోనే ఏదో నిరాశాబీజం చీకటిని నింపసాగింది.‘గతం’గుర్తుకొచ్చింది.్‌్‌్‌ఆశారాజు ఓ పల్లెటూరిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ‘చాలీచాలని జీతంతో ఎన్నాళ్లీ జీవితాన్ని ఎదుగుబొదుగు లేకుండా లాక్కెళ్లడం’ అని మనసులో ఒకే చింతన. ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. చాలా మార్గాలు ఆలోచించాక..... ఒక్క వ్యాపారం తప్ప తనకేదీ లాభాన్ని, సంతృప్తిని ఇవ్వదని గట్టిగా నమ్మాడు.‘ఏ వ్యాపారంలో కాలు మోపుదామా’.... అని ఆలోచించే సమయంలో పగిలిన ప్రత్తి కాయల్లో భవిష్యత్‌ మెరుపులు కనిపించాయి. పొలాల నిండా ధగధగ మెరుస్తోన్నప్రత్తి అతని లక్ష్యానికి దారులు పరిచింది. సీజన్‌లో ప్రత్తిని మిల్లులకు పంపడంలో బిజీ అయ్యాడు. ప్రత్తి కొనుగోలుదారులు మొత్తం డబ్బు ముందే ఇచ్చేవాళ్లు. 

ఎపడైనా కాస్త తగ్గితే మాత్రం వెళ్లాక డిడి పంపేవారు. ఆరోజు ప్రత్తి కొన్నవాడి దగ్గర చిల్లిగవ్వ లేదు. ‘‘మాష్టారు...దొంగల భయం ఎక్కువైందని క్యాష్‌ తీసుకురాలేదు. వెళ్లగానే మీకు కొరియర్‌లో డిడి పంపుతాను’’ అన్నాడు వాడు.‘‘ఎపడూ తీసుకువెళ్లేవాడే కదా!’’అని ధీమాతో ఒప్పేసుకున్నాడు ఆశారాజు. మూడు నిండు లారీలతో వెళ్లినవాడు మూడు వారాలైనా పైకం పంపలేదు. రాజు గుండెల్లో చిన్న అలజడి ప్రారంభమైౖంది. ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. ‘‘ ఇవ్వాళ పంపుతున్నాను....రేపు పంపుతాను....’’ అంటూనే వున్నాడు వాడు. రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆందోళనను అదుపు చేసుకుంటూనే గుంటూరులోని మిల్లుకు వెళ్లాడు ఆశారాజు.‘సరుకు ఇచ్చి డబ్బులు పట్టుకెళ్లిపోయాడని, వాడికి మిల్లుతో సంబంధం లేదని’తేలింది. కన్‌ఫర్మ్‌ అయింది....తను నిలువుగోతిలో పడ్డాడు. ఇపడెలా? భూకంపం వచ్చి భూమి చీలికలో కూరుకుపోయినట్లయింది. ఏడుపును దిగమింగుకుంటూనే అప్పటి వరకూ వ్యాపారంలో సంపాదించిందంతా రైతులకు పంచేశాడు.షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది.

కాలం మాన్పిన గాయాల నేపథ్యంలో తన దృష్టి మళ్లీ ఓ ‘ప్రాజెక్టు’పై పడింది. అది వినూత్నం...అదే ‘గొర్రెలు, పొట్టేళ్ల పెంపకం!’ కళ్లముందే వాటి పెంపకం దార్లు లక్షలకు లక్షలు మూటగట్టడం రాజులో ‘ప్రాప్తకాలజ్ఞత’ను కలిగించింది.పెంపకందార్లను ఇంటర్వ్యూ చేసి సారాంశాన్ని ఫిల్టర్‌ చేసి... ఓ శుభముహూర్తాన ఓ పది పొట్టేళ్లను, ఐదు మేకలను కొనుగోలు చేశాడు. ‘వాటిని ఎక్కడ! ఎలా పెంచాలి!’ అన్న శంకలేవీ లేవు. ఎందుకంటే తన మదిలో వాటిని కొనకముందే పెంపకంపై ప్రణాళిక వుంది.