ఈ కథ ఇప్పటిది కాదు. మా మెడ్రాస్‌లో వైన్‌ షాపుల్ని రాష్ర్టీయం చేయకముందునాటిది. ఇంతకూ మా మెడ్రాసుంది చూసేరా- ఇపడంతా ‘సెన్నై’ అంటుండారు గాని- మా సిటీని మెడ్రాసంటేనే నాకు మా గొప్పగా వుంటాది- మా మెడ్రాసు మన బారద్దేసంలోనే నాలుగు మహానగరాల్లో ఒకటని మీకందరికి తెలిసిన సంగతే గదా.

మన అయిదరాబాదు మాదిరగా మా మెడ్రాసుని మెగాసిటీ అంటారో లేదో తెలవదు గానీ మెటిరోపాలిటన్‌ సిటీ అని మాత్రం అంటారని నేను కచ్చితంగా చెప్పగల్ను. మా సిటీ గురించి శానా మందికి తెలిసిన యిసయాలు, తెలీని యిసయాలు కొన్ని వున్నాయి. శానామందికి తెలిసిన యిసయం ఏందంటే ఈ ఓల్‌ మొత్తం పెపంచకంలోని అందమయిన, పొడవాటి బీచీల్లోకెల్లా మా మెడ్రాస్‌ మెరీనా బీచిది రెండోస్తానం అని. అయితే ఫస్టు బీచి ఏందయ్యా అంటే కచ్చితంగా చెప్పలేను గాని పత్రికలో పన్జేసే మా బాలసుబ్రమని చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ బూమ్మీద అమెరికాలోని మియామియో గియామియో అదేనంటబ్బా ఫస్టు.సరే. మా మెడ్రాసు గురించి శానామందికి తెలీని యిసయాలు కొన్ని సెప్తాయినుకోండి. మా మెడ్రాసు వోటేల్లలో మీకు దొరకని టిపినంటూ యేదీలేదు. 

మిలిట్రీ వోటేల్ల సంగత్తీస్కోండి. బ్రెడ్డు టోస్టు ఆమ్లెట్టు కావాల్నా? గేదకాళ్ల సూపు- ఇక్కడ పాయా అంటార్లే దాన్ని- దోసెలే, అపం, ఇడియాప్పం, పరోటా, చపాతి, ఇడ్లీ కావాల్నా? బన్‌ బటరుజామూ, బ్రెడ్‌ బటర్‌జామూ కావాల్నా? ఇగ మాంసం,గుడ్డు కురుమాతో బాటు ఇయ్యన్నీ కావాల్నా? లేదనే నా కొడుకెవడండి? ఇక ఉత్తర దేసెంలో దొరికే రసగుల్లాలు, గులేబిజాముల సంగతి సరేసరి.ఇంకా మా ఊరి వుడిపి వోటేల్ల సంగతింటే మీరు మరీ ఆచ్చెర్యపోతారు. దోసెల్లో ఎన్ని రకాలున్నాయో తెల్సా? సాదా దోశె, స్పెషలు సాదా దోశె, ఆనియన్‌ దోసె, ఊతప్పం, మసాలాదోసె, స్పెషల్‌ మసాలా, బట్టర్‌ మసాలా, ఘీ మసాలా, రవాదోశె, ఆనియన్‌ రవా, డ్రై ఫ్రూట్‌ రవా, ఎన్నయినాయండీ? పదకొండో పన్నెండో రకాల దోశెలు కదా?