‘‘ఏవండీ... ఎక్కడున్నారు?’’ ఊరంతటికీ వినిపించేంత గట్టిగానే అరిచింది సుమిత్ర చేతిలో పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పుని ఒలింపిక్‌ జ్యోతి పట్టుకున్నంత దర్జాగా పట్టుకుని మరీ. ఆ కాఫీకప్పుని అతడి చేతికందిస్తే ఆరోజు ప్రారంభానికి ముందు ఓ ప్రధాన బాధ్యత నెరవేర్చినట్లే. అందుకే, కాఫీ కప్పుని వెంటేసుకుని మరీ ఇల్లంతా కలయతిరుగుతోంది. కిచెన్‌ కాకుండా ఉన్న రెండు గదుల్నీ జల్లెడపట్టింది. డ్రాయింగ్‌ రూంలోకి తొంగి చూసింది. పెరట్లోకి వెళ్లింది. ‘‘ఊహూ...!’ భర్త జాడ కనిపించలేదు.‘‘ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్లారబ్బా? ఎట్లీస్ట్‌..... మార్నింగ్‌ వాక్‌ కూడా అలవాటులేని మనిషాయే. పెళ్లయిన ఈ రెండు నెలల్లోనే కొలంబస్‌ ఇండియా కనిపెట్టినట్లు భర్త గురించి ఆమె కనిపెట్టిన సత్యం అదే. అంతలోనే గది మధ్యలో ఉన్న టీపాయ్‌ వైపు ఆమె చూపుపడింది. అర గంట క్రితమే వచ్చిన డైలీ పేపర్‌ చదివేవాళ్లు లేక అనాథలా గాలికి కొట్టుమిట్టాడుతోంది. అయితే, అక్కడే ఉండాల్సిన ఆయనగారి సెల్‌ ఫోన్‌ మాత్రం సుమిత్రకి కనిపించలేదు.

‘అంటే... లేచీలేవగానే ప్రపంచయానం మొద లెట్టేసారన్న మాట. ఇంక ఆయన ఇప్పట్లో ఇంటికి వచ్చినట్లే’ నిట్టూర్చింది సుమిత్ర. వెనుకటికెవరో ఇల్లాలు సంక్రాంతి పండక్కి రథంముగ్గేస్తూ ఊళ్లకి ఊళ్లే దాటేసిందంటూ గతంలో ఎప్పుడో పత్రికలో పడిన ఓ కార్టూన్‌లా సరిగ్గా ఇప్పుడూ అదే వ్యంగ్యాన్ని తన భర్తపై టార్గెట్‌ చేస్తే సూపర్‌గా పేలుతుంది. ఎందుకంటే... సెల్‌ఫోన్‌ మోగితేచాలు ఊరంతా ఊరేగుతారాయన.

ఒక్క రింగైతే చాలు... ‘అలవైకుంఠపురంబులోని నగరిలో అమూల సౌధంబులో...’ అన్నట్లు ఇంట్లో విష్ణుమూర్తిలా కామ్‌గా ఉండే ఆయన సెల్‌ కూత వినిపించగానే గజేంద్రుని మొర వినిపించినట్లు ‘సిరికిన్‌ చెప్పక, శంఖు చక్రముల్‌ ధరించక’ అన్న తరహాలోనే అచ్చం బిహేవ్‌ చేస్తారు. ఆ సమయంలో ఒంటిమీద దుస్తులు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోరు. ‘సిగ్నల్‌’ లేదంటూ సెల్‌ఫోన్‌ పట్టుకుని చెవికోసిన మేకలా - ‘హలో.... హలో! వాయిస్‌ సరిగ్గా లేదు. డిస్టర్బ్‌అవుతోందం’టూ గావుకేకలు పెడ్తూ గదులన్నీ పచార్లు చేస్తారు. ఆపై వీధిలోకి ఓ దూకుదూకి పరుగు లంకించుకుంటారు. ఎక్కడ ఎత్తయిన ప్రదేశముందో వెతికి పట్టుకుని మరీ చిన్నపిల్లాడిలా గెంతులేస్తారు. కనిపించిన గుట్టా పుట్టా ఎక్కేస్తూ సిగ్నల్‌ కోసం నానా తంటాలు పడుతుంటారు. అప్పుడప్పుడూ తమింటి మేడమీద... ఎప్పుడైనా ఎదురింటి, పక్కింటి మేడల మీద కనిపిస్తూ ‘ఇందుగలడందులేడనే సందేహం వలద’న్న రీతిలో ‘సర్వాంతర్యామి’లా సాక్షాత్కరిస్తుంటారాయన. ఆ ఆలోచన రాగానే బయటకొచ్చి ఎదురింటివైపు చూసింది. దాంతో, ఎదురింటి ఆంటీ నవ్వుతూ ఆమెని పలకరించింది.