సాల్ట్‌లేక్‌లో కాగ్నిజన్ట్‌ ఆఫీస్‌ దగ్గర ట్యాక్సీ ఎక్కి వి.ఐ.పి. హల్దీరామ్‌ దగ్గర దిగారు రశ్మి, విజయ్‌.రశ్మి క్లబ్‌టౌన్‌ వైపు, విజయ్‌ కేంద్రీయ విహార్‌ వైపు వెళ్ళిపోయారు.ప్రతిరోజూ సాయంత్రం ఆఫీస్‌ నించి తిరిగి వస్తున్నప్పుడు ఇద్దరూ ఒకే ట్యాక్సీలో రావటం అలవాటయింది.పొద్దుట ఇద్దరి టైములూ కుదరవని విడివిడిగా వస్తారు. సాయంత్రం కలిసే.ఇద్దరూ బాగా పరిచితులయ్యారు.ట్యాక్సీ చాలా ఖర్చు వ్యవహారం! విజయ్‌ లోన్‌కి అప్లయ్‌చేసి బైక్‌ కొన్నాడు. విజయ్‌ కొత్త బైక్‌పై రావడం చూసి ఆ సాయంకాలం రశ్మి ఒక్కతే ట్యాక్సీ ఎక్కబోయింది.‘‘మేడమ్‌, ఇక ట్యాక్సీ అవసరం లేదు. రండి లిఫ్ట్‌ ఇస్తాను. మీ కాంప్లెక్స్‌ గేటు దగ్గర ఆపుతాను. పొద్దుట కూడా మీ టైముకే నేను నా పన్లు అడ్జస్ట్‌ చేసుకుంటాను’’. ‘నా ఆకర్షణ అలా ఉంది’ రశ్మి గర్వపడింది.పొద్దున్నా, సాయంకాలం రెండుసార్లూ విజయ్‌ బైక్‌మీద ఆఫీసుకి వెళ్లివస్తున్నారిద్దరూ.ఇద్దరూ స్నేహితులయ్యారు.ఓ రోజు విజయ్‌ ఆఫీసుకి రాలేదు. మర్నాడు రాలేదు. తర్వాతి రోజు రాలేదు. రశ్మి విజయ్‌ ఉంటున్న ఇల్లు వెతుక్కుంటూ కేంద్రీయ విహార్‌కి వచ్చింది.రూమ్‌లో విజయ్‌ పడుకుని ఉన్నాడు.పక్కన ఇంటివారి పనబ్బాయి స్టూల్‌ మీద కూచుని ఉన్నాడు.

‘‘రెండు రోజుల్నించి జ్వరం’’ - మందులు చూపించాడు.రశ్మి విజయ్‌ నుదురు తాకి చూసింది.ఆ స్పర్శకు లేచాడు విజయ్‌. కళ్లు ఎర్రగా ఉన్నయ్‌.‘‘పనబ్బాయి ఆటో తెస్తాడు. పక్కనే చార్నాక్‌ హాస్పిటల్‌ ఉంది. డాక్టరుకి చూపిద్దాం’’ అంది రశ్మి.హాస్పిటల్నించి వచ్చేక పనబ్బాయి తెచ్చిన టీతో టాబ్లెట్లు మింగించి, ‘‘రేపు వస్తాను’’ అని రశ్మి వెళ్లిపోయింది.ఈవెనింగ్‌ ఆఫీసు అయ్యాక రశ్మి వచ్చింది.విజయ్‌ కూచుని చదువుకుంటున్నాడు.‘‘బాగా రిలీఫ్‌ వచ్చినట్టుంది’’ అంటూ చేతిలోని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ స్టూల్‌ మీద ఉంచింది రశ్మి.‘‘బాబోయ్‌, ఇన్ని పళ్లు నాకే?’’‘‘జ్యూస్‌ తియ్యడం మొదలెడితే పళ్ళు నిముషంలో ఖతమ్‌’’ - బత్తాయి రసం తీసి ఇచ్చింది.ఇద్దరూ దగ్గరయ్యారు.పొద్దునా సాయంత్రం బైక్‌మీద కలిసి తిరుగుతుంటే ఇంకా ఇంకా దగ్గరయ్యారు. వారాంతాల్లో ఏవేవో ప్రోగ్రామ్స్‌ వేసుకుంటూ ఒకసారి విక్టోరియా మెమోరియల్‌, ఇంకోసారి ప్లానెటోరియమ్‌, మరోసారి మ్యూజియమ్‌, సినిమాలు - ఇలా టైమ్‌ తెలియకుండానే గడుస్తుంటే ఇద్దరూ ఒకటిగా అయేంత దగ్గర అయిపోయారు.