కాజీపేట రైల్వే స్టేషన్లో ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫారం మీద రైలు ఆగింది. దిగేవాళ్లని దిగనివ్వకుండా జనం తోసుకుంటూ ఎక్కుతున్నారు. కాఫీలు, టీలు, టిఫిన్లు, పళ్లు,పుస్తకాలు అమ్మేవాళ్ల కేకలతో అంతా గందరగోళంగా వుంది. ఇంకో పక్క బిచ్చగాళ్ల బెడద సరేసరి. రైల్లో కూర్చున్న ఒక పెద్దాయన పక్కాయనతో‘‘ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నారు ఇంత మంది జనం? ఎక్కడ చూసినా కిటకిటలాడుతూనే వున్నాయి. ధరలాకాశాన్ని అంటుతున్నా బట్టలషాపులు, బంగారం షాపులు, సినిమా హాళ్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ రద్దీగానే వుంటున్నాయి.

చివరకి విమానాశ్రయాలు కూడా ఈ మధ్య రైలు స్టేషన్లలాగా రద్దీగా వుంటున్నాయి. ఇది ఇలాగే సాగితే చివరకి మనిషి నిలబడడానికి కూడా భూమి మీద చోటు దొరకదండి బాబూ’’ అని అన్నాడు.పక్కాయన వేదాంతిలా శుష్కహాసం చేసి వూరుకున్నాడు. గార్డు విజిల్‌ వేశాడు. రైలు కదిలింది. ఎక్కడ వాళ్లక్కడ సర్దుకుని కూర్చున్నారు. కాజీపేట స్టేషన్లో గేటు దగ్గర టిక్కెటు కలెక్టరు టిక్కెట్లు తీసుకొని ప్రయాణీకుల్ని బయటకి పంపిస్తున్నాడు. ఇంతలో ఒక పదహేరేళ్ల కుర్రాడ్ని తరుముకుంటూ ఒక పెద్దాయన వచ్చాడు.‘‘ఏమయింది సార్‌?’’ టిక్కెట్‌ కలెక్టరు అడిగాడు. ఆ కుర్రాడు చూడ డానికి మంచి కుటుంబం నుంచి వచ్చినవాడిలా వున్నాడు. ఈ పెద్ద మనిషి అతడిని ఎందుకు తరుముకొస్తున్నాడో అర్థం కాలేదు.మళ్లీ రెట్టించి ‘ఏమైంది సర్‌’ అని అడిగాడు.‘‘ఈ అబ్బాయి వేసుకున్న చెప్పులు నావి. కావాలంటే వాటి మీద లేబుల్‌ చూడండి. అవి కొత్తవి. ప్రయాణం కోసం అని నేను కొనుక్కున్నాను’’ అని అన్నాడు.టిక్కెట్టు కలెక్టరు ఆ కుర్రాడ్ని ‘బాబూ ఆ పెద్దాయన చెప్పులు నువ్వు తీశావా?’ అని అడిగాడు.‘‘నేను తియ్యలేదు ఇవి నావే’’ అని అన్నాడా కుర్రాడు.‘‘అయితే ఆ చెప్పులు ఏ కంపెనీవో చెప్పు’’ అన్నాడు టిక్కెట్టు కలెక్టరు.దాంతో ఖంగుతిన్నాడా కుర్రాడు.‘‘మర్యాదగా నీ చెప్పులు ఆ పెద్దమనిషికి ఇచ్చేయ్‌. 

ఇంతలో టిక్కెట్‌ కలెక్టర్‌ దృష్టి కుర్రాడి చేతిలో వున్న సూట్‌కేస్‌ మీద పడింది.‘‘ఈ సూట్‌కేస్‌ నీదేనా? ఇంకెవరిదైనానా?’’ అని అడిగాడు.ఎదురు చూడని ప్రశ్నకి ఆ కుర్రాడు తడబడ్డాడు. అతని మొహంలో భయం స్పష్టంగా కనపడింది. దాంతో టిక్కెట్టు కలెక్టర్‌ ఇదేదో అనుమానించ వలసిన కేసే అన్న నిర్ణయానికి వచ్చాడు. స్టేషన్‌లో డ్యూటీలో వున్న పోలీసు ఇన్‌స్పెక్టర్‌కి ఆ కుర్రాడ్ని అప్పగించాడు.కుర్రాడ్ని చూసి ఇన్‌స్పెక్టర్‌ ‘అమాయకంగా వున్నాడే ఈ కుర్రాడు, ఈ సూట్‌కేస్‌ దొంగిలించి వుంటాడా? పైగా వేషం, భాష కూడా డీసెంట్‌గా వున్నాయి’ అని అనుకొని,‘‘బాబూ నీ పేరేంటి? నీ పేరెంట్స్‌ ఎక్కడుంటారు?’’ అని అడిగాడు.