ఉదయం పిల్లలు కాలేజీకి, భర్త ఆఫీసుకి వెళ్ళాక పని పూర్తి చేసుకుని టీవీ ముందు కూర్చుంది విశాలాక్ష్మి. ఏ ఛానల్‌ తిప్పినా సీరియల్స్‌, వంటలే. ఇప్పుడు వీటికి డిమాండలా ఉంది మరి. ఏవో అర్ధం కాని సమస్యలు, పాత్రలు, మలుపులు, కథకన్నా సంభాషణలే ఎక్కువ సాగదీయడం మామూలే. వీటినే ‘ఆడవాళ్ళు’ ఎక్కువ ఇష్టపడుతున్నారని అనుకుంటున్నారు కాబోలు. ఈలోపు ఫోన్‌ రింగవటంతో ‘‘హమ్మయ్య! కాసేపు కాలక్షేపం’’ అనుకుంటూ తీసి ‘హలో’ అంది.‘‘ ఆ విశాల! నేనే పార్వతిని మాట్లాడుతున్నా!’’ అంది పెద్దక్కయ్య.‘‘ఆ! పెద్దక్కా చెప్పు. పెళ్ళి హడావిడంతా సర్దుకుందా! పిల్లలు హనీమూన్‌ వెళ్ళారా?’’ అడిగింది నవ్వుతూ విశాలాక్షి.పదిరోజుల క్రితం పార్వతి కొడుకు సందీప్‌ పెళ్ళయింది.

అంతా వెళ్ళి వచ్చాం. చాలా గ్రాండ్‌గా చేసారనే చెప్పాలి. ఏదో పాకేజ్‌ట. ఆరు లక్షలు వాళ్ళచేతుల్లో పెడితే మొత్తం హాలు, బ్రాహ్మడు, బ్యాండ్‌మేళం, భోజనాలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అమ్మాయి తల్లితండ్రులు చెన్నైలో ఉండటం వల్ల డబ్బు వీళ్ళ చేతుల్లో పెట్టి పెళ్ళి ఏర్పాట్లుచేసారు. అన్నీ బాగానే ఉన్నాయనిపించింది. పైన ఇంకా డబ్బుపెట్టుకుంటే మరింత గ్రాండ్‌గా చేసుకోవచ్చన్నమాట. అయితే డబ్బు ఎంత ఖర్చు పెట్టాం? అన్నదే ఈ రోజుల్లో పెళ్ళిచేసేవాళ్ళు చూస్తున్నారు కాని వచ్చిన వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా చక్కటి భోజనం తిని వెళ్ళారా? అని ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఇదివరకు పచ్చటి అరిటాకుల్లో రక రకాల కూరలతో విస్తరి అందంగా ఎప్పుడు తిందామా అన్నట్లుగా ఉండేది.ఇప్పుడు అరిటాకు కూడా కృత్రిమమే. ఆకు పచ్చటి రంగులు ఉన్న కృత్రిమ విస్తర్లు అరిటాకు రుచిని ఇస్తాయా వీళ్ళ భ్రమకాకపోతే!‘‘ఆ! విశాలా! నిన్ననే అందరం తిరుపతి, చెన్నై వెళ్ళొచ్చాం. పిల్లలు మాత్రం ‘సింగపూర్‌’ ఈ రాత్రికి వెళ్తున్నారు హనీమూన్‌కి. ఇదుగో ఇవాళే అందర్కి ‘కాల్‌’ చేస్తున్నా పెళ్ళికి వచ్చినందుకు ధ్యాంక్సు చెపుతూ. మరిది గార్కి కూడా చెప్పు. పాపం తక్కువ టైం గడిపినా వచ్చివెళ్ళారు. మనుగుడుపులకి వాళ్ళు ఖరీదైన చీర్లే పెట్టారులే. మా శిరీష చాలా సంతోష పడింది. దాన్ని చాలా మర్యాదగానే చూసారు’’ అంది పార్వతి.