మూసీనది బ్రిడ్జి మీదకి రాగానే హఠాత్తుగా బస్సు ఆగింది.ఎన్ని దశాబ్దాల లేదా శతాబ్దాల తరువాతనో నదీమ తల్లి వరదలతో, నురగలతో ఉరకలు పరుగులు పెడుతున్నది.బిల బిలా జనమంతా కిందకు దిగుతున్నారు.మరిన్ని బస్సులు ఆగుతూనే ఉన్నాయ్‌.మరింత మంది జనం కిందకు దిగుతూనే ఉన్నారు.నడుముల లోతు నీటిలోకి దిగిన కొందరు దోసిళ్ళ కొద్దీ నీళ్ళు తాగు తున్నారు. ‘‘ఒద్దొద్దు, తాగకండి, మురికినీళ్ళు! ఆరోగ్యానికి మంచిది కాదు. తాగొద్దు, తాగొద్దు’’ అరుస్తున్నా. ‘‘ఎవరన్నారయ్యా, ఇవి మురికి నీళ్ళని, చూడు, ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయో!’’ అంటున్నారు వాళ్ళు. ‘‘ఎంత తియ్యగా ఉన్నాయో, రండి, రండి! కడుపు నిండా తాగండి’’ అంటూ మిగతావాళ్ళని ఆహ్వానిస్తున్నారు. కొందరు మరికొంత ముందుకుపోయి నదిలో తనివితీరా ఈదులాడుతున్నారు. ‘‘నడుము నొప్పులూ, ఒంటి నొప్పులూ మటుమాయమవుతున్నాయి. చర్మవ్యాధులు క్షణంలో నయమవుతున్నాయ్‌. రండి, రండర్రారండి, నీటిలో దూకండి’’ అంటూ ఉత్సాహంగా కేకలేస్తున్నారు.‘‘ఈ నీళ్ళు తాగం గానే ఎక్కడలేని సత్తువొస్తున్నది. నీరసం దూరమవు తున్నది, రండయ్యా రండి, రండమ్మా రండి, కడుపార తాగండి’’ దోసిళ్ళ కొద్దీ నీళ్ళు తాగుతున్నారు.

 ఇతరులతో తాగిస్తున్నారు.అంతా కోలాహలం. నీళ్ళు తాగేవాళ్ళు తాగుతున్నారు. ఈదేవాళ్ళు ఈదుతున్నారు.కిందికి దిగిన నేను ముందుగా కొంచెం నీరు పుక్కిట పట్టి ఉమ్మి, అటు తరువాత ఓ గుక్కెడు మింగా. ఆశ్చర్యం, కొబ్బరి నీటికంటే తీయగా, రుచిగా ఉన్నయ్‌! దోసిలిపట్టి మళ్ళీ మళ్ళీ తాగా. కడుపు నిండి నట్టయింది. ఇంతకు ముందెన్నడూ లేనంత హాయిగా వుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది.మిగతా వాళ్ళందరితో పాటు నదిలోకి దూకి ఈదులాడుతున్నా, నీరసం గానీ, అలసట గానీ అనిపించడం లేదు. మేనినంతా నిమురుతున్న అలలు నాలో ఏదో కొత్తశక్తిని నింపుతున్నట్టనిపిస్తున్నది....నదీ తీరం వెంట విశాలమైన పచ్చిక బయళ్ళు.పచ్చికబయళ్ల నిండా సీతాకోక చిలుకల గుంపుల్లా గుంపులు గుంపులుగా పిల్లలు.... చల్లని, మెత్తని గరిక పచ్చమైదానాల్లో నగ్నపాదాలతో లేడి పిల్లల్లా పరుగులు పెడుతూ, గంతులేస్తూ... రంగు రంగుల గరికపూలు కోస్తూ ఒకరిపై మరొకరు రువ్వుకుంటూ సిగల్లో తురుముకుంటూ...పిల్లల కోలాహలంతో పొదల నుండి బయటపడి పరుగులుతీస్తున్న కుందేళ్ళు... వెంటబడే బాలల గుంపులు... పొదలమాటున బిక్కు బిక్కు మంటూ నక్కిన కుందేటి పిల్లలను అక్కున చేర్చుకుంటున్న మరి కొందరు... వాటి నీలి నీలికనుల సౌందర్యాన్ని వీక్షిస్తూ కొందరు, ఎర్రెర్రని బుజ్జిబుజ్జి పెదాలను ముద్దిడుతున్న మరికొందరు... వాటి శరీరాల మఖ్మల్‌ మెత్తందనాలతో మైమరిచి పోతున్న మరికొందరు...చెవులు రిక్కించి, మోరలు సాచి ఇందరిందరు పిల్లలను ఆశ్చర్యంతో పరికిస్తూ కదలక, మెదలక, శిలా ప్రతిమల్లా లేళ్ళ మందలు... అంతకంటే ఆశ్చర్యంతో, ఆనందంతో వాటిని సమీపించే పిల్లల గుంపులు...