వర్షం!కుండలతో దిమ్మరించినట్టు ఒకటే వర్షం.ఎక్కడా ఏ వస్తువూ కనిపించడం లేదు. ప్రతి ప్రాణి కంటికీ, ఎదుటి వస్తువుకూ మధ్య వర్షం తెర. ఆ తెరల వెనక కనిపించీ కనిపించనట్టు దాగుడు మూతలాడే వస్తువులు. ఎన్ని వర్షం తెరలో! లెక్క లేనన్ని తెరల్ని లెక్కపెట్టాలంటే ముందుగా అక్కడ ఎన్ని ప్రాణులున్నాయో తెలుసుకోవాలి. అన్ని ప్రాణుల్నీ లెక్కలోకి తీసుకోకూడదు. చూస్తున్నవి మాత్రమేకావాలి. కలుగుల్లో నిద్రపోతున్నవీ, కళ్ళు మూసుకున్నవీ పనికిరావు. అలాగే వస్తువులూనూ, ఒకదాన్ని ఒకటి ఆవరించి పూర్తిగే కప్పేయకుండా కొద్దిగానన్నా కనిపించే వస్తువుల్నే లెక్కపెట్టాలి. అప్పటికీ యింకా ఓ చిక్కు మిగిలి పోయే వుంది. పది వస్తువులకీ అడ్డుగా ఒకే తెర వుండొచ్చు. ఒకే తెర పది చూపులకీ అడ్డు పడొచ్చు. లెక్కించడం కష్టమే! అందుకని ఒకే తెర మడతలుపడి, అన్ని వస్తువులనూ ఆవరించి చుట్టుకొని మెలికలు తిరిగి వుందని చెప్పుకుంటే అదోరకమైన తృప్తికరమైన సమర్థన.వర్షం చినుకులు నిప్పురవ్వల్లా తుళ్ళు తున్నాయి. చినుకుల్లో వెలుగు లేదు. నిప్పురవ్వల్లోని కాంతిని కొంత తగ్గించి చూస్తే ఎలా వుంటాయో అలా వున్నాయి చినుకులు.ఆ కాంతిని తగ్గించడం సాధ్యం కాదని చాలామంది అభిప్రాయం. కాంతి ప్రకాశం చూపునిబట్టి వుంటుంది. చూపు అన్నింటికీ ఒక్కరకంగానే లేదు. ఆకాశంలో ఎగిరే గ్రద్దకు చూపు తీక్షణమైనది. అంత మీదనుంచీ అది నేల మీదున్న చిన్నపిచ్చికను కూడా చూడగలదు. చూడడం అంటే ప్రకాశాన్ని గ్రహించడం అన్నమాట. 

వెలుగు పిచ్చికమీద పడి పరావర్తనమై ప్రయాణించి గ్రద్ద చూపుకు అందుతుంది. ఆ కొద్దిపాటి పరావర్తన వెలుగునూ అది గ్రహించగలదు. కాని మనిషి గ్రహించలేడు. మనిషి చూపు మందమైనది. కొద్దిపాటి పరావర్తన కిరణాల్ని అది గ్రహించలేదు. కనుక చూపునుబట్టి ప్రకాశం కనిపిస్తుంది. నిప్పు రవ్వల్లో కాంతిని తగ్గించాలంటే చూపులో భేదం రావాలి. చలవ కళ్ళజోడు పెట్టుకుంటే కాంతిని తగ్గించి చూడడం అన్నమాట.నిప్పురవ్వలు ఏ నీలం రంగు కళ్ళద్దాల్లోంచో, మట్టిరంగు కళ్ళద్దాల్లోంచో కనబడ్డట్టు చినుకులు కన బడుతున్నాయి. కొండమీది రాతిబండలపై పడి పక్కలకు చెదిరి పడుతున్నాయి. అక్కడ అన్నీ కొండలే. కొండలపైన పైకి పొడుచుకొచ్చిన బండరాళ్ళు. కొండ దిగువ కనుచూపు మేర అడివి. కొన్ని వేల సంవత్సరాలుగా వర్షంలో కరిగి, యింకా మరికొన్ని వేల సంవత్సరాల ఆయుష్షుతో ఆకాశంలోకి చూస్తున్నాయి బండరాళ్ళు.ఆకాశంలో మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ఆ అల్లికలో ‘యూనిఫార్మిటీ’ లేదు. నైరూప్య చిత్రంలా గజిబిజిగా వుంది. లేతరంగూ, ముద్దరంగూ కలవక ఎక్కడికక్కడ అతుకులు వేసి అంటించినట్టు వుంది.