దండకారణ్యంలో ఉండే ఒక ఋషి మహేంద్రుడు. సమాజాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచడమే ఆయనకు తెలిసిన సత్కార్యం. అందుకు తగిన మనుషులు ఎవరా అని ఆలోచించకపోయినా, విధివశాత్తు విజయుడు, దయానిధి అనే ఇద్దరు ఒకరి తర్వాత మరొకరు ఆయన దగ్గరకు వచ్చారు. వారిద్దరికీ సమాజానికి మేలు చేయడానికి అవసరమైన శక్తులు ఇచ్చాడాయన. ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఈ ప్రయత్నంలో విజయుడు తన శక్తులు పోగొట్టుకోగా, దయానిధీ అదే మార్గం అవలంబించాడు. కానీ ఏం జరిగిందంటే..

**************************

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, పరోపకారం కోసం నీవాళ్లని వదులుకుని ఈ అపరాత్రివేళ ఇక్కడికొచ్చావు. కానీ మమకారం ఎలాంటిదంటే చివరికి నీ కృషి ఫలితాన్ని నీవాళ్లకే ధారపోసేలా చేస్తుందని దయానిధి కథ చెబుతుంది. ఆయన కన్నబిడ్డల ప్రవర్తన నచ్చక ఇల్లు వదిలివెళ్లాడు. అర్హులను మాత్రమే సన్మానించే షరతుపై అపారసంపదకి హక్కుదారుడయ్యాడు. ప్రవర్తన మారని కన్నబిడ్డల్ని అర్హులుగా గుర్తించి సన్మానించాడు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.చోడవరంలో దయానిధి అనే భూస్వామి మంచితనానికీ, సత్ప్రవర్తనకీ పేరుపడ్డాడు. ఆయన భార్య విరజ అన్నివిధాలా భర్తకి తగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి పిల్లలు లేకపోవడం ఒక్కటే లోటు. సంతానంకోసం విరజ ఎన్నో పూజలు చేసింది. నోములు నోచింది.

చివరికి తనకి సంతానయోగంలేదని అనుమానించి భర్తని రెండోపెళ్ళి చేసుకోమని కూడా చెప్పింది.దయానిధి ఒప్పుకోలేదు, ‘‘నిన్ను నేను సంతానంకోసం చేసుకోలేదు, తోడుగా ఉంటావని పెళ్ళి చేసుకున్నాను. పిల్లలుపుడితే వాళ్లు మనిద్దరికీ తోడుగా ఉంటారు. లేదూ మనం ఒకరికొకరు తోడుగా ఉందాం. పిల్లలులేరని నీకు మనశ్శాంతి లేనట్లుంది. కొన్నాళ్లు తీర్థయాత్రలుచేసి దగ్గర్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించి వద్దాం పద’’ అన్నాడాయన.మనశ్శాంతి కోసం కాకపోయినా ఆ పుణ్యఫలంతో సంతానం కలగొచ్చునన్న ఆశతో విరజ సరేనంది.తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఆ దంపతులకి ఒక ఊళ్లో గుడిముందు శుష్కదేహంతో ఉన్న బవిరి గెడ్డపు బిచ్చగాడు కనిపించాడు. వాడి ప్రవర్తన విచిత్రంగా ఉన్నది. దానంగా వచ్చిన సొమ్ముని వాడు వెంటనే ఇతర బిచ్చగాళ్లకి ఇచ్చేస్తున్నాడు. అందుకనేమో వాడికి దానమిచ్చేవారి సంఖ్య తక్కువగా ఉన్నది. ఇది గమనించిన దయానిధి వాడిమీద జాలిపడి, ‘‘నీకు దానంగా వచ్చిన సొమ్ము నీ దగ్గరే ఉంచుకో, ఎక్కువనిపిస్తే ఎవరూ చూడకుండా ఇతరులకి దానంచెయ్యి. లేకుంటే దానం లభించక ఆకలికి మాడి చస్తావు’’ అంటూ వాడికో వరహా ఇచ్చాడు.