కులం, గోత్రం లేని అనాథతో పెళ్లేంటి..? అని తల్లి ఆగ్రహించడంతో.. నేరుగా ఆ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికే వచ్చేసింది.. అంతే ఇంట్లో పెద్ద గొడవే జరిగింది.. మొత్తానికి ఆ కూతురు భర్తతో కలిసి అమెరికాలో హాయిగానే ఉంటోంది.. అప్పుడప్పుడు తండ్రికి మాత్రం ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడుగుతూ ఉంటుంది.. కొన్నేళ్ల తర్వాత.. చెప్పాపెట్టకుండా.. ఆ కూతురు అమెరికా నుంచి వచ్చింది.. మాటల్లో ఓ షాకింగ్ నిజం తెలిసి.. ఆ తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..
********************

 

మా చిన్నకూతురు అవని, అల్లుడు రఘుల కబుర్లతో, ముద్దుల మనవడు ఆయుష్‌ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి. అల్లుడు తెచ్చిన బర్త్‌డే కేకు మా ఇంటి డైనింగ్‌ టేబుల్‌ మీద సగం స్థలాన్నే ఆక్రమించినా, మా ఆవిడకి ఇష్టమైన బటర్‌స్కాచ్‌ కేకుని, అది కూడా సరిగ్గా అర్థరాత్రి పన్నెండుగంటలు కొడుతుండగాతెచ్చి మమ్మల్నందరినీ ఆశ్చర్యపరచేసి ఆవిడ మనసునిమాత్రం పూర్తిగానే ఆక్రమించేశాడు అల్లుడు.

మా ఆవిడ కళ్ళల్లో మెరుపులు చూస్తే చాలు ఎవ్వరికైనా ఆ విషయం తేలిగ్గా అర్థమవుతుంది.ఎందుకోగానీ ఇలాంటివన్నీ నాక్కాస్త అతిగా అనిపిస్తాయి.ఈవేళ మాత్రం ‘పోనీలే, పెద్దదాని నిర్వాకంవల్ల బాధపడ్డ తల్లిమనసుకి ఈ అల్లుడివల్లనైనా సాంత్వన కలిగితే అంతకంటే ఏం కావాలి’ అనిపించింది.ఆనందంగా గడిపే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్‌లూ వద్దంటూ అందరి సెల్‌ఫోన్లూ ఆఫ్‌ చేసేసి మా మనవడితో మాత్రమేకాకుండా మాచేత కూడా ఫన్‌గేమ్స్‌ అంటూ ఏవేవో ఆటలు ఆడించాడు రఘు.రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చుని అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము.రోజంతా సంతోషంగానే గడిచినా ఆ క్షణానమాత్రం మా ఆవిడ వదనాన్ని నీలిమేఘాలు కమ్మేసినట్లనిపించింది.

అడక్కుండా ఉండలేకపోయాను.‘‘అదోలా వున్నావేమిటి ప్రభా?’’ఆ ప్రశ్న కోసమే కాచుకున్నట్లుగా వెంటనే చెప్పింది.‘‘చూశారా, మూడేళ్లక్రిందట మన కుటుంబసభ్యుడిగా చేరిన మన చిన్నల్లుడితోసహా మీరంతా నా పుట్టినరోజుని ఇంతబాగా గుర్తుపెట్టుకున్నారే! అలాంటిది కన్నకూతురు, అదే మీ ముద్దులపెద్దకూతురు. అది మాత్రం ఎలా బిగదీసుకుని కూర్చోందో చూడండి! ‘అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఒకచిన్న పలకరింపుకూడా లేదు చూడండి’’.బర్రున ముక్కు చీదేసింది.‘‘మీరేం మాట్లాడరే?’’ రెట్టించింది.మరో రోజైతే తప్పకుండా సమాధానం ఇచ్చేవాణ్ణి. కానీ పుట్టినరోజున తన మనసుని బాధపెట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను.