ఆ చుట్టుపక్కల ఐదారు గ్రామాల్లో బసవడంటే అందరికీ గౌరవం. చూపులకు సాక్షాత్తూ నందీశ్వరుడే . బసవడు ఎదురైతే చాలు రైతులందరూ ఎడ్లమెడ మీంచి కాడిదించి బండిని వేరుచేసి వాటికి విశ్రాంతి నిచ్చేవారు.. బసవడు వెళ్ళిపోయాక మళ్ళీ బళ్ళుకట్టుకుని వెళ్ళేవారు. బసవడంటే రైతులకు ఎందుకు అంత గౌరవం? వాళ్ళమధ్య ఏదైనా ఒప్పందం ఉందా? ఐతే ఏమిటా ఒప్పంద రహస్యం?

‘పశువులు పసిపాపల్లాంటివి. ఆటిని ప్రేమతో సాకాలిగానీ కసిగా హింసించకూడదయ్యా! బిడ్డల్ని కన్నోళ్లకి తెలుస్తాది ఆ ప్రేమ. నీకూ నాకూ ఎట్టా తెలుస్తాదీ?’’ అంది నాగమణి భర్త వీపు సబ్బుతో రుద్దుతూ.‘‘ఎయ్యిరూపాయిలే! ఎయ్యిరూపాయలు ఏట్లో కలిసిపోయాయే ఆడివల్లా. ఎవడు తిన్నదయిందీ? ప్రేమ చూపించాలా ప్రేమ! ఈసారి ఎదుర్రావాలి దాన్సిగదరగా తలపగిలిపోద్ది! ఆ!’’ అన్నాడు అమ్మిరాజు ఆవేశంగా.‘‘శివశివా! నీ నోరడిపోనూ ఏంటా మాటలూ? నోరులేని జీవాన్ని కొడితే పుట్టగతులుండవు. బసవడు దేవుడు!’’ నాగమణి మాట పూర్తిచేసేలోపే కస్సుమనిలేచాడు అమ్మిరాజు. ‘‘ఛయ్‌ నీ.. ’’ అంటూ ఓ బూతుతిట్టి ఎదురుగా ఉన్న నీళ్ళగిన్నెని ఫెడీల్మని తన్నాడు. ‘‘ఇంకోపాలి ఆణ్ణి దేవుడన్నావో ముందు నిన్ను నరుకుతా!’’ అంటూ స్నానం పూర్తికాకుండానే ఒళ్ళు తుడుచుకుంటూ విసవిసా ఇంట్లోకెళ్ళిపోయాడు అమ్మిరాజు.నాగమణికి నోట మాటరాలేదు. భర్త కోపంచూసి ఒణికిపోయింది. ‘‘ముదనష్టపోడు అన్నంతపనీ చేస్తాడు. బసవన్నా నిన్ను నువ్వే కాపాడుకో తండ్రీ ఈడికెదుర్రాబోకు!’’ అంటూ దణ్ణం పెట్టుకుంది.

బసవడు! బసవడి పేరుచెబితే ఆ ఊళ్ళోనేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల వారెవరూ ‘ఏ బసవడూ?’ అని అడగరు. ‘ఓహో మన బసవడా?’ అంటారు. అందరికీ అతడంత ఆప్తుడూ కావలసిన వాడూనూ!కొన్నేళ్ళక్రితం కాలవ అవతల ఊళ్ళో వందెకరాల ఆసామి నీలంరాజుగారు అచ్చోసి వదిలేసిన ఆబోతే ఈ బసవడు! శ్రేష్ఠమైన గిత్తదూడని తెచ్చి, పూజలుచేసి, వెనకవైపు రెండు చట్టలమీదా శంఖుచక్రాలు అచ్చుపోసి ఒదిలేరు. ఆబోతుకు అవే గుర్తులు. ఆ గుర్తులున్న గిత్తనెవరూ కట్టడి చెయ్యకూడదు. అది స్వేచ్ఛాజీవి. చేతనైతే ఇంత తిండిపెట్టి దణ్ణంపెట్టాలిగానీ బంధించడం, బాధించడం వంటివి చెయ్యకూడదు. అక్కడి ప్రజలందరికీ ఇది స్పష్టంగా తెలుసు. అప్పట్నించి బసవడు ఆ చుట్టుపక్కల ఐదారుగ్రామాల్లో యధేచ్ఛగా తిరుగుతూ ఎవరేంపెడితే అది తింటూ ఏపుగా ఎదిగేడు. గున్న ఏనుగులా బలిష్టంగా పెరిగాడు.