తెల్లగా తెల్లారిపోయినా నిద్రలేవలేదు సత్తిన్నారాయణ! బహుశా రాత్రి తాగింది దిగలేదేమో మరి! అసలు తాగే అలవాటుందో లేదో గానీ, పేకాట పిచ్చి మాత్రం మా బాగా ఉంది సత్తిన్నారాయణకి. వాళ్ళ పుత్రరత్నం బడ్డూగాడైతే ఇంకోరకం!! ఇద్దరూ ఇద్దరే! వాళ్ళిద్దరినీ కంట్రోల్లో పెట్టాలంటే మీనాక్షికే సాధ్యం మరి. తెల్లారి లేస్తే పేకాటతండ్రికి చేతినిండా తైలం కావాలి! తిండిపోతు కొడుక్కి కంచంనిండా చికెనూ మటనూ కావాలి! వీళ్ళతో ఆ ఇల్లాలు ఎలా వేగుతోందంటే.....

**************************

‘ల్లె.... ల్లె... ల్లేహ్‌... లె...లె...లే నా ర్రాజా...ల్లేపమంటావా..? నిద్దుర లేవనంటావా...?’నిద్రమత్తు కొద్దికొద్దిగా వదులుతూ ఉంది! అంతలోనే మళ్ళీ ‘ల్లె... ల్లె...ల్లేహ్‌....కాసేపటికి మళ్ళీ మొదలు,ల్లె...ల్లె....ల్లేహ్‌...లె...లె....లే నార్రాజా...ల్లేపమంటావా...నిద్దురలేపనంటావా..?’’‘‘యేవండీ! మీ మొద్దునిద్దర పాడుగానూ, మీ నిద్దర కొండపోలేరమ్మ ఎత్తుకపోనూ, గట్టు మైసమ్మ తీసుకుపోనూ...లె...లె....లే అని ఆ సెల్లు అదేపనిగా అరుస్తోంది వినబడ్డం లేదా?’’ పూజగదిలో దేవుడిపటాలముందు దీపాలుపెడుతున్న మీనాక్షి, ‘‘శుక్లాంబరధరం...విష్ణుం ...’’ అంటూ చదువుతున్న శ్లోకాన్ని మధ్యలోనే ఆపి... గొంతుపెంచి పైబాణీలో కస్సుమని లేచింది.ఏంటే అర్థరాత్రి గోల...? మూడోసారి కూడా రింగ్‌ టోన్‌ పూర్తయ్యాక సెల్లు అందుకుంటూ ఆన్‌చేసి విసుక్కున్నాడు మీనాక్షి మొగుడు!‘‘ఓర్నిద్రమొగం గాడా..? ఇది అర్థ రాత్రా...? కళ్ళు తెరచి చూడు...నీ బెడ్రూమ్ గోడ మీద గడియారాన్ని! తూర్పువైపున కిటికీ ఉంది అటు కూడా చూడు...’’మీనాక్షి మొగుడు ఆ రెండు పనులూ చేశాడు. గడియారంలో టైం తొమ్మిదిన్నర చూపెడుతోంది. కిటికీలోంచి ఎండ చెంపదెబ్బలు కొడుతోంది!‘‘మాట్లాడవేం. నోరు పుచ్చిందా... చచ్చిందా...’’ ఫోన్‌లోంచి ఘాటుగా వినిపించింది.

పూర్తిగా మత్తువదిలేసింది సత్తిన్నారాయణకు (అందరూ ఇలానే పిలుస్తారు).‘‘ఎవడీ రాస్కెల్‌ నా కొడుకు...?!’’ విపరీతమైన ఆశ్చర్యం, అంతే మోతాదులో కోపావేశాలు తన్నుకొచ్చేసినయ్‌ సత్తిన్నారాయణకు!‘‘అసలు ఎవడీడు..? పొద్దున్నే లేపి తనను వాయించేస్తున్నాడు...? కొంపదీసి రాంగ్‌ నంబర్‌ గాడా...?’’ అలా పైకి అనుకోగానే ఆవేశం కొంచెం చల్లబడింది! కోపం మాత్రం అలానే ఉంది!‘‘నిన్నే...ఇక్కడికొచ్చేస్తోంది నీ నోటికంపు....థూ....’’‘‘అరేయ్‌! ఎవరనుకుని అలా పిచ్చోడిలా వాగుతున్నావుర్రా నన్ను నిద్రలేపి మరీ...?’’‘‘బడ్డూగాడు అలియాస్‌ ఎమ్కేరావుగాణ్ణి పుట్టించి ఈ లోకానికి తెచ్చిన సత్తిన్నారాయణ హెచ్‌ బై ఓ మీనాక్షివేనా...?’’ అవతలినుంచి ప్రశ్న వినబడింది.