ఇల్లు యింకా వందగజాల దూరంలో వుంది. అరుగుమీద జనం కనిపించడంలేదు. ఏమయినా జరిగివుంటే జనం యింటిముందు పోగయి వుండేవారు. నేల కూడా బురదతో తడిగాలేదు.ప్రాణం కొంత కుదుటపడింది. నూటయాభై మైళ్ళదూరం నుంచి బిగబట్టిన భయం. యాభై గజాల దూరం నుంచి బిగబట్టిన ఊపిరి ఒక్కసారిగా సడలిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు.రిక్షా గుమ్మం ముందు ఆగింది.రిక్షా ఆగడం చూసి చుట్టుపట్ల యిళ్లవాళ్ళు అరుగుమీదకి వచ్చి చూస్తున్నారు. కొందరు తలుపుల వెనకనించి, మరికొందరు కిటికీల అవతలనించి.వాళ్లు అలా చూడ్డం ఏమిటోలా వుంది. కొత్తగా వుంది. ఇంతకు ముందు అనేకసార్లు వచ్చాడు. అప్పుడు యిలా చూళ్ళేదు. యధాలాపంగా చూసి, కాసేపు సరదాగా ఆసక్తిగా నిలుచునేవారు. ఇప్పుడు సరదాలేదు. ఆసక్తి మాత్రం వుంది. దానితోపాటు జాలికూడా.వాళ్ళు అలా చూస్తోంటే మళ్ళీ భయం వేసింది. గుండె దడదడ లాడింది. రిక్షావాడికి డబ్బులిచ్చి మెట్లు ఎక్కుతోంటే కాళ్లు తడ బడ్డాయి. ఊపిరి బిగపట్టాడు. తలుపుతట్టాడు.ప్రభ వచ్చి తలుపుతీసింది. ‘‘రా బావా’’ అంది.

 

ఆమె పిలుపులో జీరలేదు. చూడగానే బావురుమనలేదు. ఓ నిమిషం ఆగిపోయినట్టు అనిపించిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది.‘‘మీ అక్కయ్యకెలా వుంది?’’‘‘కొద్దిగా కోలుకుంది. హాస్పిటల్లో చేర్పించాం.’’‘‘ఇంతకీ జబ్బేమిటి?’’ప్రభ మాట్లాడలేదు. ‘‘అమ్మా నాన్నా హాస్పిటల్లోనే వున్నారు. స్నానం చేసి వెళ్దువుగాని, కోటిగాడ్నిచ్చి పంపుతాను. ఒరేయ్‌ కోటీ.. భూషణం బావ వచ్చాడురా..’’కోటేశ్వరరావు వచ్చి పలకరించాడు. చిన్న తనం, పలకరించడమే కాని పరామర్శించడం తెలీదు.‘‘మీ అక్కయ్యకి ఎలా వుంది?’’‘‘ఇప్పుడు బాగానేవుంది. పొద్దున్న వెళ్లొచ్చాను’’ అన్నాడు.ప్రభ నీళ్లు తోడానని పిలిస్తే వెళ్ళి స్నానం చేసి వచ్చాడు నాగభూషణం. కాఫీ కాచి పట్టుకొచ్చింది. తాగుతూ... ‘‘నిన్ననే రజనీ ఉత్తరం రాసింది. అందులో కనీసం ఒంట్లో నలతగా వుంటోందని చూచాయగా కూడా ఏంలేదు. ఇంకో వారం పదిరోజుల్లో వీలు చూసుకుని తనని తీసుకెళ్లడానికి రమ్మంది. సరిగ్గా రోజు తిరక్కముందే యీ టెలిగ్రాం. ఏమిటంత జబ్బు? డాక్టరు ఏం చెప్పాడు’’ అన్నాడు.‘‘ఇప్పుడే వస్తున్నా ... పొయ్యిమీద పోపు మాడిపోతోంది’’ అంటూ లోపలికి హడావుడిగా వెళ్ళింది ప్రభ.