‘ఏమే, ఊరికే ఉండలేవా, నేనెక్కడకెళ్తే నీకెందుకు?’ అడిగాడు కమల్‌ రోషంగా.‘చూడవే రాగిణీ, నీ కొడుకు నన్ను ఎలా నిలదీస్తున్నాడో? వీడికి తిండి ఎక్కువ పెడుతున్నావు, బాగా పొగరు ఎక్కువైంది’ అంది దమయంతి.‘అబ్బ ఊరుకోండి ఇద్దరూ. తెల్లారితే మొదలుపెడతారు కీచులాటలు. ప్రశాంతంగా టీవి కూడా చూడనివ్వరు. అసలు మిమ్మల్ని పెట్టి డెయిలీ సీరియల్‌ తీస్తే బాగుంటుంది’ విసుక్కుంది రాగిణి.‘పోమ్మా నువ్వు మరీను. ఈ ముసలిదాని ముఖం చూసి, మొత్తం టీవి ప్రేక్షకులంతా బాధపడాలా, మనం కష్టపడుతున్నది చాలదూ’ అన్నాడు కమల్‌ వెటకారంగా.

‘అబ్బో నా ముఖానికేమైందిరా.. నా పోలికే వచ్చింది నీకు కూడా. నా ముఖం బాగోలేదు అంటే నిన్ను నువ్వు తింటుకున్నట్లే, ఏమనుకుంటున్నావో!? అమ్మాయ్‌ నువ్వు వీడిని ఏదైనా హోటల్‌లో క్లీనర్‌గా అన్నా జాయిన్‌ చేసెయ్యవే, ఇంట్లో వీడి గొడవ పడలేక పోతున్నాం’ అంది దమయంతి.‘ఏయ్‌ ముసిలీ, నేను చేసింది హోటల్‌ మేనేజ్‌మెంట్‌. పెద్ద స్టార్‌ హోటల్‌లో మేనేజర్‌ని అవుతాను తెలిసిందా’ అన్నాడు కమల్‌ మొఖం ఎర్రగా చేసుకుని.

‘అదీ చూద్దాం. నేను బతికుండగా జరుగుతుందా?? నాకు నమ్మకం లేదు!’ అంది దమయంతి, మూతి మూడు వంకరలు తిప్పి.‘నువ్వు అప్పుడే ఎలాచస్తావు. పాపీ చిరాయువు అని ఊరికే అన్నారా!’ అన్నాడు కమల్‌ వెటకారంగా చూస్తూ.‘ఒరే ఎప్పుడుచూడు, మా అమ్మ చావు గురించి మాట్లాడితేగాని నీకు తృప్తిగా ఉండదారా?!’ చిరాకు పడింది రాగిణి.‘నేనా అన్నది. ఆ ముసిలిదే కావాలని నాతో అలా అనేలా చేస్తుంది.

నువ్వేమో నన్ను తిడతావు. ఛీ’ అంటూ బైటకు వెళ్ళిపోయాడు కమల్‌.‘నువ్వైనా ఊరుకోవచ్చు కదమ్మా. పిల్లలతో సమానంగా వాదులాటలేసుకుంటావు’ మెత్తగా మందలించింది రాగిణి.‘‘ఏంటక్కా! మళ్ళీ గొడవపడ్డాడా అమ్మతో, కోపంగా వెళ్తున్నాడు కమల్‌. నేను పలకరించినా పలకలేదు. రుసరుసలాడుతున్నాడు’ అన్నాడు అప్పుడే లోపలికి వస్తున్న శంతను.‘ఒరే, వీళ్ళు జాతివైరం ఉన్న కుక్క, పిల్లి లాంటి వాళ్ళు. ఇద్దరికీ క్షణం కూడా పడదు’ అంది రాగిణి.‘అది ఎప్పుడూ ఉండేదేకదా! అమ్మకు వాడిని చూస్తే తిక్క లేస్తుంది’ అన్నాడు శంతను.