‘‘ఎందుకా నవ్వు? వేళాకోళమా? వెళ్ళిపోయింది కాక ఆ నవ్వొకటి? అయినా నీకెందుకంత తొందర..? రా... కిందకు దిగిరా..! పంచుకున్న పాటల్లో, నాలుక్కళ్ళనీ ఒక్కటిగా చేసి చూసిన దృశ్యాల్లో, వన్‌బైటు కాఫీలో, విసురుకున్న వెన్నెల సోనల్లో... దూరేసి, దూర్చేసి, జీవితాన్ని కూరేసి, కూర్చేసి... కలిసేకదా.. పంచుకున్నాం! నాకోసం నువ్వన్నావ్‌, నీ కోసం నేనన్నావ్‌, మందికోసం మనమన్నావ్‌.. మరిప్పుడేమిటిలా..? మందినీ, నా మదినీ వదిలి నీదారి నువ్వు చూసుకున్నావ్‌? కలిసే వెళదామని అలా ఎలా వెళ్ళిపోగలిగావ్‌? నువ్వులేని ఈ జీవి, నీ జ్ఞాపకాల నిజాలను వెతుక్కుంటూ, రాత్రిళ్ళు మనసు పేగు కదిలి కదిలి నిద్రకి ఉరి వేస్తోంటే.. అణువణువూ దుఃఖం నిండిన నా అన్నవాహి కంతా ఖాళీ...! రా.. వచ్చి తినిపించు. అన్నీ తెలిసిన మహాయోగిలా అలా నవ్వకు. నా గుండె ఒరుసుకుపోతోంది. నవ్వద్దన్నానా..? ఎందుకు నవ్వుతున్నావ్‌..?’’ఎదుట కేన్‌కుర్చీలో కూర్చుని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, వెనక్కీముందుకీ ఊగుతూ తెరలు తెరలుగా నవ్వుతున్న కృష్ణ నెత్తిమీద ఒక్కటివ్వబోయి, తూలి ముందుకు పడిపోయాను.

ఎంతటి తడబాటు? అసలే కృష్ణ అర్థాంతర అంతర్థానంతో అణువణువునా ఆక్రమించేసిన ఒంటరితనం.. ఆపైన మరిచిపోలేని అతని జ్ఞాపకాల్లో అనుక్షణం మునిగి తేలుతూ భ్రమలో తూలి ముందుకు పడిపోబోయేసరికి ఒక్కసారిగా దుఃఖం ఎగజిమ్మింది. కృష్ణలేని ఈ నిస్సారమయ జీవితంలో తనకింక ప్రతీది తడబాటేనేమో! ఆలోచనల్ని చెదరగొడుతూ ఫోన్‌... అమ్మేనేమో!స్వరాన్ని సవరించి కాల్‌బటన్‌ నొక్కాను. అమ్మే...!‘‘ఏం చేస్తున్నావమ్మా...?’ ఆ పిలుపుతో దుఃఖం దిగంతాలని తాకగా.. మనసు మౌనరోదనకి గురైంది.

‘‘విశాలా... హలో... నిన్నే... పలకవేం... అమ్మా విశాలా?’’ ‘‘ఆ... అమ్మా..’’ అతికష్టం మీద గొంతు పెగల్చాను.‘‘జ్యూస్‌ తాగావా..?’’‘‘ఆ....!’’‘‘నిజమేనా?’’‘‘ఆ...! రెడీ అవుతున్నా. రేపు కాలేజ్‌. మార్కెట్‌కెళ్ళి పళ్ళూ, కూరగాయలూ తెచ్చుకుందామని..’‘‘ఉంటానంటే వద్దన్నావ్‌. ఒక్కదానివీ వెళ్ళ గలవా?’’ ‘‘తప్పదు కదా...!’’ ఉడుకుమోయిందమ్మ.కాసేపయ్యాక ఫోన్‌ పెట్టేసి ముఖం కడుక్కుని చెప్పులు బయటేశాను. పక్కనే హష్‌ పప్పీస్‌, కృష్ణ ఫేవరెట్‌ షూస్‌. కొన్నప్పుడు ఎంత గొడవచేశాడో, అంత ఖరీదైనవెందుకని. ఏమనుకున్నానో అని అనుకుంటూ... మళ్ళీ అంతలోనే,