ఏనుగు జీతం

తమిళ కథ: యానైయిన్ సంబళం

మూల రచయిత: ఎ.ముత్తులింగం

అనువాదం: అవినేని భాస్కర్

********** 

మరో మార్గంలేదు. ఏనుగును తీసుకురాక తప్పదు అని చెప్పింది జయవర్ధనే. ఎలా? అని అడిగితే ‘‘అదెంత పని! నేను తీసుకొస్తాను’’ అన్నాడు. అన్ని రకాల సమస్యలకూ వాడిదగ్గర పరిష్కారాలు ఉంటాయి. అయితే చిత్రంగా మాకు వచ్చే చాలా సమస్యలకు మూల కారణం కూడా వాడే!లాంబ్రెటా కంపెనీ ప్రారంభించినప్పుడు యువ అప్రెంటీస్‌లు కావలసివచ్చారు. అట్టడుగుస్థాయి ఉద్యోగం, తక్కువ జీతం. అయినా ఇంటర్వ్యూకి 200 మందికి పైగా వచ్చారు. ఇంటర్వ్యూ జరిగిన రోజు పొద్దున అప్పటి ప్రతిపక్ష నాయకుడు జె.ఆర్‌.జయవర్ధన కార్యదర్శి ఒక వ్యక్తిని సిఫారసు చేస్తూ ఫోన్‌ చేశాడు. అతని పేరు లలిత్‌ జయవర్ధన. చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు. ఆ రోజుల్లో శ్రీలంకలో జయవర్ధన అనే పేరు విరివిగా పెట్టుకునేవాళ్ళు. రెండేళ్ల తర్వాత జె.ఆర్‌.జయవర్ధన ప్రధాని అవుతారని, మరో రెండేళ్ళ తర్వాత ప్రెసిడెంట్‌ అయిపోతారని అప్పుడు ఎలా ఊహిస్తాం! ఎందుకైనా మంచిదని లలిత్‌ని ఎంపిక చేశాను. దానికంటే మూర్ఖత్వం మరోటి ఉండదు.లలిత్‌ మాట్లాడితే వింటూ ఉండొచ్చు. సమపాళ్ళలో నిజాన్ని అబద్ధాన్ని కలబోసి మాట్లాడతాడు కాబట్టి వినసొంపుగా ఉంటుంది.

ఆర్కిమిడీస్‌ సిద్ధాంతం గురించి మాట్లాడితే, వాడే ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టినట్టు అంత సాధికారంగా మాట్లాడగలడు. వాడి జుట్టు విచిత్రంగా ఉంటుంది. నడి నెత్తిన పాపిడి తీసి రెండు పక్కలా సమానంగా చెవుల కిందదాకా వచ్చి పడేవి. ఆకర్షణీయ మైన ముఖం. చలాకీగా, హుషారుగా వాడు నడుస్తుంటే జుట్టు జారి నుదుటమీద అడ్డుపడుతూ ఉంటుంది.ఫ్యాక్టరీని విస్తరించాలని పక్కనున్న అడవిని తీర్చి దిద్ది, స్థలం ఏర్పాటు చెయ్యమని ఇటలీ నుండి ఆర్డర్స్‌ వచ్చాయి. దట్టంగా చెట్లు బలిసిన అడవిని తీర్చి దిద్దటం అన్నది ఖాండ వవన దహనంకంటే పెద్ద పని అనే చెప్పాలి. అంత పెద్ద చెట్లని నరకడం కూడా సులువే గానీ, నరికిన చెట్ల మొదళ్ళనీ, కొమ్మల్నీ తొలగించడం ఇచ్చిన గడువులోపు పూర్తయ్యే పని కాదు. ఏనుగుతో వస్తానని వెళ్ళిన లలిత్‌ అంతే వేగంగా ఏనుగుతో తిరిగి వచ్చాడు.