‘‘అమ్మగారూ, నేనెళ్తున్నాను.. తలుపేసుకోండి’’ పనిమనిషి మాటలతో పడక గదిలో మనవడిని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాలులోకి వచ్చింది.తలుపు వేయబోతుంటే వరండా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉండడం గమనించి భారంగా నిట్టూర్చింది. బోల్టుతో బాటు సెంట్రల్‌ సేప్టీలాక్‌ కూడా వేసి హాల్లోకి వచ్చింది. పగలు పన్నెండు కావస్తోంది.

అది హైదరాబాద్‌, నానక్‌రాంగూడలోని ముప్పయి ఫ్లాట్లున్న అపార్టుమెంటు బిల్డింగ్‌. అందులో అందరూ గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లే. వాటిల్లో సగానికి పైగా అద్దెకున్నవాళ్లే.విశాలాక్షి కొడుకూ, కోడలూ అలాంటి ఉద్యోగస్తులే కావడంతో పదిరోజుల క్రితమే ఆ అపార్టుమెంటులోకి అద్దెకు వచ్చారు.ఫోను రింగయ్యింది. ఊహించినట్లుగానే కోడలు చేస్తోంది.‘‘శ్రేయస్‌ పడుకున్నాడా అత్తయ్యా.’’‘‘ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు, నిద్రపుచ్చుతున్నాను.’’కోడలు ఫోన్‌ పెట్టేసింది.కొద్దిసేపటికి భుజం మీది పిల్లాడు భారంగా అనిపించసాగాడు. శరీరమే కాదు మనసు కూడా విశ్రాంతి కోరుకుంటోంది.గత నాలుగు సంవత్సరాల నుండి మనవలనీ మనవరాళ్లనీ సాకడంలోనే గడచిపోతోంది కాలం. ఎన్నో ఊహించుకుంది. భర్త రిటైరయిన తరువాత తనకిష్టమైన తీర్థాలు, ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలనీ! టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలనీ! నవలలూ చదవాలనీ!రిటైరయిన ఆరు నెలల లోపే భర్త చనిపోవడం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు! ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. భర్త రిటైర్‌మెంటు లోపలే ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయిలిద్దరూ అమెరికాలో ఉన్నారు. అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్‌లో.

ఇప్పుడు వాడి ఇంట్లోనే తన ఈ శిశు సంరక్షణ డ్యూటీ!తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు ఆమెకు వీసా ఏర్పాట్లు చేసింది. అప్పటికే ఆ అమ్మాయి గర్భిణి. ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం. నిండు చూలాలికి రెండు నెలలు, ఆ తరువాత బాలింత కూతురికి, నవజాత శిశువుకి నాలుగు నెలలు ఆనందంగా, ఇష్టంగా శుశ్రూషలు చేసింది. ఆరునెలల గడువు ముగుస్తుండగా పెద్ద కూతురు అత్తగారు రావడంతో ఇండియాకు తిరిగి వచ్చింది విశాలాక్షి.ఆరునెలల కాలం ఇట్టే గడచిపోతుండగా పెద్దకూతురు దాదాపు ఏడాది వయసున్న తన కొడుకును అత్తగారితో విశాలక్షి దగ్గరికి పంపించింది. ఏడాది పాటు వాడిని పెంచడంలో ఎంతో అలసిపోయిందామె. తనకు వయసు మీద పడుతున్న సంగతి అప్పుడే తెలిసొచ్చిందామెకు. వాడి సతాయింపు కన్నా తన కూతురు ‘వాడి బట్టలన్నీ డెట్టాల్‌ వేసి ఉతుకుతున్నావా - డైపర్స్‌ రెగ్యులర్‌గా మార్చుతున్నావా’ అంటూ రెండుగంటలకో మారు ఫోన్‌ చేసి సతాయించేది. అలా అతి కష్టంగా ఓ సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురి దగ్గర్నుండి ఫోన్‌, తన దగ్గరికి రమ్మని కారణం తను గర్భవతినయ్యానని.