అదొక అందమైన కలలగూడు. అది కేవలం ఒక ఇటుకల గూడు మాత్రమే కాదు, ఆప్యాయతలూ అనురాగాలు కలబోసి కట్టిన ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఇద్దరే. కథ షరా మామూలే. పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు. ఇక్కడ మిగిలిపోయిన ఇద్దరూ ఆ అనురాగ ఆలయంలో గత జ్ఞాపకాలతో ఒంటరి పక్షుల్తా కాలం వెళ్ళదీస్తున్నారు. భవిష‌్యత్‌ ఏమవుతుందో అనే ఆలోచనలో గడుపుతున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే.....

************************************

‘ఆనందరావు., రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌’ అని రాసున్న గేటును తోసుకుని వాకిట్లోకి వెళ్ళాడు రేవంత్‌. వాకిట్లో ఒక్కో అడుగు వేస్తుంటే ఇరుకుగదుల్లోని అసౌకర్యమంతా అతని పాదాల్లోంచి ప్రవహించి పాతాళంలోకి పారిపోతున్నట్లుగా అనిపించింది. గేటునుంచి ఇంటిగుమ్మంవరకూ నడవడానికి వీలుగా చక్కగా సిమెంట్‌చేసి ఉంది. ఆ బాటకు ఇరువైపులా ఇటుకలు నిలబెట్టి అవతలివైపు ప్రాంతాన్నంతా పూలమొక్కలు, కూరగాయల మొక్కలతో నింపేశారు. కొంచెం దూరం ముందుకెళ్ళాక ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద వేపచెట్టుకు చుట్టూ కూర్చోవడానికి వీలుగా సిమెంట్‌ చప్టా కట్టించారు. పెరట్లో ఏపుగా పెరిగిన మామిడిచెట్టుకింద చతురస్రాకారంలో చేసిన సిమెంటు బెంచీలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. పార్క్‌’ లాగా తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఇంటి ఆవరణ అతని మనసును ఆనందంలో ముంచెత్తుతోంది.బ్యాంకులో పెద్దస్థాయి ఉద్యోగంచేస్తూ నగర జీవితానికి అలవాటుపడిన రేవంత్‌కు ఆ ఇంటి పరిసరాలు కొత్తదనంతోపాటు ఏదో తెలియని నూతనోత్తేజం కలిగించాయి. వేపచెట్టుకింద నిలబడి ఇంటివైపు చూశాడు.

పెద్ద పెంకుటిల్లు ఇంతింతై వటుడంతై అన్నట్లు దర్శనమిచ్చింది. తనకు పల్లెటూర్లంటే అంతగా ఇష్టం లేకపోయినా భార్య బలవంతంమీద ఆ ఇల్లు చూడడానికి వచ్చాడు. రిటైరయ్యేనాటికి బోలెడు ఖాళీస్థలం, పూలమొక్కలతో నిండిన ఇల్లుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని తన భార్య విశాలనమ్మకం. హాయిగా అన్నిసౌకర్యాలు వదిలి పట్నంనుండి పల్లెటూరికి రావాలంటే తన మనసుకు ఇష్టం లేకపోయినా రాక తప్పిందికాదు. పైగా గజంభూమి కొనాలంటే పట్నాల్లో లక్షలు గుమ్మరించాలి. ఒకవేళ అంత డబ్బుపోసి ఏ పదిసెంట్లో కొనుగోలు చేసినా దానిలో ఇల్లు కట్టుకోవడం తలకుమించిన భారంతోపాటు నిరంతరం పర్యవేక్షణ లేకపోతే మోసపోతామని భయం కలగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.