మూడంకె వేసుకొని, చిన్నిపాపలా అమాయకంగా నిద్రపోతున్న ఆమెవేపు కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడతను. నిష్ణాతుడైన శిల్పి శ్రద్ధగా మలచిన పాలరాతి శిల్పంలా ఉన్న ఆమెను గర్వంగా చూస్తూ, కొద్దిగా విచ్చుకున్న గులాబీ రేకుల్లాంటి ఆమె ఎర్రని పెదాల్ని మధ్యమధ్యలో, ఆమెకు నిద్రాభంగం కాకుండా సున్నితంగా ముద్దాడుతూ, గంటలు నిమిషాల్లా కరిగించేయడం అతనికి కొత్తేమీ కాదు.

ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్న అతనికి చిన్నప్పుడెప్పుడో చదివిన ‘స్లీపింగ్‌ బ్యూటీ’ కథ గుర్తుకొచ్చింది.‘ఆ రాజకుమారుడెవడో గాని, వాడు ముద్దుపెట్టుకుంటే సుదీర్ఘమైన నిద్రనుంచి లేచి కూర్చుందట ఆ స్లీపింగ్‌ బ్యూటీ. ఇప్పుడు నేను ముద్దుపెట్టుకుంటే నా స్లీపింగ్‌ బ్యూటీ ఏం చేస్తుందో చూద్దాం’ అనే చిలిపి ఆలోచన పుట్టింది అతనిలో.చిన్నగా నవ్వుకున్నాడు తనలో తను. కూర్చున్న చోటునుండి చప్పుడు చెయ్యకుండా లేచి నిలబడ్డాడు. నెమ్మదిగా చెయ్యి చాచి, ఆమె నుదిటిమీద చిందరవందరగా పరచుకున్న చిక్కని ఉంగరాల జుత్తుని నెమ్మదిగా సవరిస్తూ, ఆమె పెదాలమీద ముద్దుపెట్టుకున్నాడు గాఢంగా.ముద్దుకు నిద్రాభంగమైన ముద్దుగుమ్మ ముద్దుగా కళ్ళుతెరిచి, రెండుచేతులూ అతని మెడచుట్టూ పెనవేసి, అతని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది ‘ఛుప్‌’మని చప్పుడొచ్చేలా.కళ్ళు చికిలించి చిన్నగా నవ్వింది పెదాలు విడీ విడివడకుండా.‘

‘ఎంతసేపు నన్నలా చూస్తూ కూర్చుంటావురా. నిద్ర రావట్లేదూ.. రా వచ్చెయ్‌’’ అంటూ ఆహ్వానించింది హస్కీగా.ఆమె కౌగిలిలో వెచ్చగా ఇమిడిపోతూ ‘‘రమ్మని ఆహ్వానిస్తే పొమ్మనటం పాడికాదు పూవిల్తుని రాజ్యమునకు... మధుశాలకు’’ అని సెలవిచ్చాడు కదా మహాకవి. నువ్వంత సెక్సీగా రమ్మని చేతులు చాస్తే, రాకుండా ఉండగలడా ఈ అల్పజీవి’’ అన్నాడతను కాంక్ష నిండిన కళ్ళతో ఆమె కంటిలోతుల్లోకి చూస్తూ.‘‘పూవిల్తుని రాజ్యం సరే, మధుశాల ఏదిరా ఇక్కడ’’ అందామె అతన్ని సున్నితంగా, నేర్పుగా రెచ్చగొడుతూ.‘‘తెలీదా ఎక్కడో. ఇదిగో... ఇక్కడ’’ అంటూ కెంపుల్లా మెరుస్తున్న ఆమె పెదాలపై సుతారంగా చుంబించి, ‘అధరాల వీధిలోన మధుశాలలున్నదానా’ అంటూ దాశరథి కలవరించినది నీలాంటి మధురమైన అధరాలున్న సౌందర్యం కొరకేనేమో. ‘శేషేంద్ర పద్యం, ఫ్రెంచ్‌ మద్యం’ రెండూ దిగదుడుపే కదూ, నా అరాళకుంతలా, నీ అధరాల ముందు’’ అన్నాడతను ఆమె పెదాలను తన పెదాలతో లాక్‌ చేస్తూ.