హైదరాబాద్: నవంబర్‌ 3నుంచి 5 వరకు ఉస్మానియా యూనివర్సిటీ అంతర్‌ కళాశాల సాంస్కృతిక పోటీలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం తెలిపారు. గురువారం ఓయూ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23 అంశాలలో మూడు రోజుల పాటు ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియం, టెక్నాలజీ కళాశాలల ఆడిటోరియాలలో ఈ సాంస్కృతిక పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో జానపద, పాశ్చాత్య సంగీత పోటీలు, వ్యక్తిగత అంశాలు, మిమిక్రి, ఉపన్యాసం, రంగోలి, క్లెమోడలింగ్‌, స్కింట్‌ వంటి అంశాలలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. అంతేకాకుండా సుమారు 25 మందిని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసుల విభాగం ఆధ్వర్యంలో చత్తీస్‌ఘడ్‌ రాయ్‌కూర్‌లోని పండింట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీలో జరిగే సెంట్రల్‌ జోన్‌ యూత్‌ - కల్చరల్‌ ఫెస్టువల్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఓయూ స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఓయూ అంతర్‌ కళాశాలలో సాంస్కృతిక పోటీలకు ఆయా కళాశాలలు, విద్యార్థులు ఈనెల 29 లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. సుమారు 400 కళాశాలల నుంచి వెయ్యి మందికిపైగా విద్యార్థులు పాల్గొనే అవకాశముందన్నారు. సమావేశంలో ఓయూ రిజిస్ర్టార్‌, ప్రొఫెసర్‌ ఇ.సురేష్‌కుమార్‌, సీపీఆర్‌వో డాక్టర్‌ అనిల్‌కృష్ణ, పీఆర్‌వో డాక్టర్‌ ఇ.సుజాత, యూత్‌ వెల్ఫేర్‌ అధికారిని ప్రొఫెసర్‌ సూర్య ధనుంజయ, యూత్‌ వెల్ఫెర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సవీన్‌సౌధా పాల్గొన్నారు.