నలిమెల భాస్కర్‌ పద్నాలుగు భారతీయ భాషలను స్వయంకృషితో నేర్చుకున్నారు. తెలంగాణ భాష పట్ల ఉన్న అపోహలను దూరం చేశారు. మారుమూలల్లో ఉన్న పదాల తెలుగుదనం గురించి రాయడం ద్వారా భాషా గౌరవాన్ని ఇనుమడింపజేశారు. భాషను కూడా సులభ రీతిలో రాయడం ద్వారా భాషాభిమానులకు, పరిశోధకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు.

తెలంగాణ ప్రాంత భాష ఇతర ప్రాంతాల భాష కన్నా భిన్నమైన వాగ్య్వవహారాన్ని కలిగి ఉన్నది. అందువలన సమైక్య రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అక్కడి పండితులకు ఇది తౌరక్యాన్ధ్రంగా వినిపించింది. ఈ ప్రాంత వ్యవహార భాష ప్రభుత్వ పాలన, ప్రసార, విద్య, న్యాయ ఇత్యాది రంగాలలో పనికిరానిదయింది. తెలంగాణ పదంలోనే తెలుంగు ఉన్నప్పటికీ ఇక్కడ మాట్లాడేది తెలుగు కాదనే అపనింద ఈ ప్రాంత బుద్ధి జీవులను ఆలోచింప జేసింది, పరిశోధింపజేసింది. తెలంగాణ ప్రాంత భాష గురించి పరిశోధన, పరిశ్రమ చేసిన వాళ్ళలో బిరుదు రాజు రామరాజు, యశోదా రెడ్డి, రవ్వా శ్రీహరి, నలిమెల భాస్కర్‌ ముఖ్యులు.డా. నలిమెల భాస్కర్‌ తెలంగాణ ఉద్యమ తొలి దశ కాలానికి ముందు ద్రావిడ భాషలలోని ప్రధాన భాషల సామెతల మీద పరిశోధన చేశారు. తెలంగాణ భాషలో ‘రాతి గుండెలు’ పేరుతో 1976లో కవితను, 1977లో ‘మంద’ పేరుతో కథను రాశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో జరిగిన అనేక సభల్లో తెలంగాణ ప్రాంత తెలుగు విశిష్టతను ప్రసంగాల ద్వారా తెలియపరచారు. తెలం గాణ భాష గురించి చేసిన కృషిలో భాగంగా తెలంగాణ పదకోశం, బాణం వ్యాసాలు, పోతన తెలంగాణ పద ప్రయోగ సూచిక, బసవ పురాణ పద ప్రయోగ సూచిక (సంపా), తెలంగాణ పత్రికలో పలుకుబడి కాలమ్‌, తెలం గాణ భాష-దేశ్య పదాలు (2017), తెలంగాణ భాష- సంస్కృత పదాలు (2019), తెలంగాణ భాష-తమిళ పదాలు (2020) మొదలైన రచనలు చేశారు.నలిమెల భాస్కర్‌ 2003లో రూపొందించిన ‘తెలంగాణ పదకోశం’ మొదటి తెలంగాణ మాండలిక పదకోశం. తెలంగాణ ప్రజల వ్యవహార భాషకు సంబంధించిన మొదటిపద సేకరణ ఇది. తనకు గుర్తున్న పదాలను, పదబంధాలను, సామెతలను రాశిపోశారు. అట్లాగే, తెలం గాణ ప్రాంత సాహితీ సంపుటాలను పరిశీలించారు. ఆనాటి ఉద్యమ అవసరాలకోసం ఏడు ఎనిమిది నెలల కాలంలో తయారైన కోశమిది. బహుభాషావేత్త కావడం వలన పదాల అర్థాలను సులువైన ప్రామాణిక భాషలో రాశారు. పదబంధాలకు, జాతీయాలకు, సామెతలకు అవసరమైన చోట వివరణలు ఇచ్చారు.

ఈ పదకోశానికి రాసిన ముందుమాటను తెలంగాణ ఇంటర్మీడియట్‌ తెలుగు వాచక పాఠ్యాంశంగా తీసుకున్నారు. మొదట ఏడువేల పదాలతో వెలువడి తర్వాత సుమారు పదివేల పదాల పుస్తకంగా 2016లో పునర్ముద్రణ పొందింది.తెలంగాణ భాష ప్రత్యేక లక్షణాలను విశ్లేషిస్తూ 2008లో వచ్చిన వ్యాస సంపుటి ‘బాణం’. దీని ద్వారా ఇంతకు ముందెవరూ చెప్పని తెలంగాణ భాష లక్షణాలను నిర్ధా రించే ప్రయత్నం చేశారు. ఇక్కడి పదాల ప్రత్యేకతకు కారణమైన నాదాత్మకత, లయాత్మకత, ద్విత్వీకరణ, సంయుక్తీకరణ, వ్యుత్పత్తులు, సామెతలు, జాతీయాల విశేషాలను వివరించారు. ప్రాచీన లక్షణాలు, అచ్చ తెలుగుతనం, ఉర్దూ భాషా ప్రభావం తదితర అంశా లపై సాధికారిక వివరణలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఇతర భాషా పదాలను, పద బంధాలను స్వాంగీకరణం చేసుకునే తీరును వివరించారు. వనభోజనాలను వంటలకు పోవుడని; కేశఖండనాన్ని పుట్టెంటికలని; ఖనన హననా లను కాలేసుడు, బొందవెట్టుడని; అస్థికల నిమజ్జనాన్ని బొక్కలు కలిపివచ్చుడు అని తత్సమాలకు అసలు సిసలు తెలుగు మాటలు ఉపయోగిస్తారని ఉదాహ రించారు. క్రియా పదాలలోనూ, బంధుత్వ వాచకాల లోనూ, సంబోధనల్లోనూ ద్రావిడ లక్షణాలు, అచ్చ తెలుగు నుడులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయని విశ్లే షించారు. మహమ్మదీయ పాలనలో అంగూర్లు, సేపులు, మోసంబీలు, సంత్రాలు, చాపత్త, ఇజ్జత్‌, బేఫికర్‌ లాంటి మరెన్నో ఉర్దూ పదాలు తెలంగాణ తెలుగులో మిళితమ యినాయని చూపారు. ఇవేకాక, తెలంగాణ భాష ప్రామాణికత- ప్రతిపాదనలు పేరుతో తెలంగాణ భాషను విద్యా పరిపాలనా రంగాలలో వినియోగంలోకి తేవడానికి అనుసరించవలసిన పద్ధతుల గురించి రాశారు. తెలంగాణ భాషా, మాండలికమా అన్న చర్చ చేస్తూ తెలంగాణలో ఉన్నది చక్కటి తెలుగేనని దీన్ని మాండలికం అనవలసిన అవసరం లేదని నిర్ధారించారు.