పరవస్తు లోకేశ్వర్‌  : పలకరింపు

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల ప్రత్యేకమైన సంస్కృతిని కేంద్రంగా చేసుకుని అనేక రచనలు చేసిన పరవస్తు లోకేశ్వర్‌ ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ‘చార్మినార్‌ కథలు’ కథా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 30న విడుదలైన సందర్భంగా పరవస్తు లోకేశ్వర్‌ను ‘వివిధ’ తరఫున మంజర్లపాటి కమల్‌ పలకరించారు.

 
మీ రచనలన్నిటికీ హైదరాబాద్‌ మాత్రమే కేంద్రంగా ఉండడానికి కారణం?

దిల్లీ, కలకత్తా, లాహోర్‌, లక్నో... నగరాలకు సంబంధించి ఇంగ్లీష్‌లో బోలెడంత సాహిత్యం వచ్చింది. అదంతా చదివే టప్పుడు, ఆ నగరాల చరిత్ర, సంస్కృతి, గొప్పతనం తెలుసు కున్నప్పుడు ఒకవైపు ఆనందంతోపాటు, ఇంకోవైపు ‘‘మన హైదరాబాద్‌ కూడా వాటికేమీ తీసిపోదు కదా! మరి మన చరిత్ర మనమెందుకు రాసుకోలేకపోతున్నాము’’ అనే బాధ కూడా కలిగింది. ఇక్కడ పుట్టి ఈ నీళ్ళు తాగినవాడిగా మన విశ్వనగర చరిత్రను నలుగురికి చెప్పే ప్రయత్నం చేసాను, చేస్తున్నాను.  


అంటే ఇంతకుముందు ఈ నగర చరిత్రను ఎవరు రికార్డ్‌ చేయలేదా?

ఇంతకు ముందు ఈ నగర చరిత్రను నెల్లూరి కేశవ స్వామి, అశోక్‌ మిత్రన్‌, అశోక్‌ మీనన్‌, భాస్కరభట్ల కృష్ణారావు రాసిండ్రు. కానీ అవన్నీ సమగ్రంగ లేవు. కొన్ని కొన్ని ఘట్టాలు మాత్రమే రాసిండ్రు. నరేంద్ర లూథర్‌ ‘థ మెమోరీస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అని సమగ్రంగనే రాసిండు. ఈ విషయంలో మనందరం ఆ మహానుభావు నికి కృతజ్ఞతలు చెప్పాలె. పంజాబీ అయినా ఈ నగరాన్ని ప్రేమించిండు. ఈ నగరాన్ని బాగా స్టడీచేసి అప్పటి సంగతు లను రికార్డ్‌ చేసే ప్రయత్నం అయితే చేసిండు. అయితే నేను ఇక్కడి భూమిపుత్రుణ్ణి. ఓల్డ్‌ సిటీల పుట్టి ఆ గడ్డ నీళ్ళు తాగినవాడిని. ఆ మనుషుల్ల పెరిగినవాడిని. వాళ్ళ జీవితంల నా జీవితం పెనవేసుకున్నది. నేను కూడా వాళ్ళల్ల ఒకణ్ణి. ‘కాబట్టి నేనే చెప్పాలె’ అనుకోలె. ‘నేను చెప్పడం కూడా మంచిదైతది. ఒక ఓల్డ్‌ సిటీ మనిషిగా ఆ కథ నేను చెప్తే బాగుంటది’ అనుకుని చెప్పడం మొదలుపెట్టిన. అలా సలాం హైద్రాబాద్‌, షెహర్‌ నామా, సలాం హైద్రాబాద్‌ రెండవ భాగం కల్లోల కలలకాలం, 1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు, హైద్రాబాద్‌ జన జీవితంలో ఉర్దూ సామెతలు మొదలైన పుస్తకాలు రాసినాను.

 
మీ కొత్త కథల పుస్తకం ‘చార్‌మినార్‌ కథలు’ ఆ పరంపరలో భాగమేనా?
అవును. డెబ్బై ఏండ్ల క్రితం చార్మినార్‌ చుట్టూ పెనవేసుకున్న జీవితాల కథలను చార్మినార్‌ కథలుగా రాసిన. ఇందులోని వ్యక్తులు నా కండ్లతో నేను చూసిన. వాళ్ళతో చాలామందితో నేను మాట్లాడిన. చార్మినార్‌ చుట్టూ ప్రదేశాలలో రెక్కలు విప్పుకున్న పక్షిలాగా తిరగిన. ఆ అమాయకపు లోకంల బతికిన మనిషిగా ఆ ముచ్చట్లన్ని ‘చార్మినార్‌ కథలు’గా రాసిన. ఆనాటి హిందూ ముస్లిం సంస్కృతి తియ్యదనాన్ని కళ్ళకు కట్టే ప్రయత్నం చేసిన.