ఎంతోమంది కవులు బాపిరాజును చిత్రకారు డన్నారు. అలాగే చిత్రకారులు ఆయనను కవి అన్నారు! అలాగే ఆ అభినందిం చడంలో కూడా ఆలస్యం చేశారని అంటారు. అదే పని పత్రికారంగంలో సంపాదకులు కూడా చేశారా అనేది నాకు తారసపడిన ప్రశ్న! అడివి బాపిరాజు కనుమూసిన తర్వాత నార్ల వెంకటేశ్వరరావు (1952 సెప్టెంబరు 24న ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాద కీయం) రాస్తూ బాపిరాజును ఎంతో అభినందించారు, ‘నరుడు’ నవలను గొప్పగా శ్లాఘించారు, అలాగే కన్నడంలోకి మాస్తి వేంకటేశ్వరయ్యంగార్‌ చేసిన వీరి అనువాదాలు గురించి పేర్కొన్నారు. అయితే బాపి రాజు సంపాదక ప్రతిభను మాటమాత్రంగా కూడా పేర్కోవడం మరచిపోయారు! ఇది ఇలా ఉండగా డా. పొత్తూరి వేంకటేశ్వరరావు వెలువరించిన ‘ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు’ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ 2004లో ప్రచురించిన) బృహత్‌ గ్రంథంలో ‘మీజాన్‌’ పత్రిక గురించి ఒక పేజీ రాశారు. అందులో ‘‘...దినపత్రికలో వస్తున్న వార్తల గొడవను సంపాదకుడు అంతగా పట్టించుకొనేవారు కాదు.. బాపిరాజు దృష్టి ఎక్కువగా తన రచనల మీదనే ఉండేది...’’ (పేజి 394) అని పేర్కోవడంలోని బాధ్యతారాహిత్యం ఎంతో భయాన్ని కల్గించింది. బాపి రాజు సంపాదకుడుగా చేసిన సేవకు సంబంధించి అదే ‘మీజాన్‌’ తెలుగు పత్రికలో పనిచేసిన తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బా రావు, సింగరాజు లింగమూర్తి వంటి వారు చెప్పిన విషయాలు వేరుగా ఉన్నాయి. పండితులు, పాత్రికే యులు తిరుమల రామచంద్ర తన ‘అహంబో అభివా దయే’ పుస్తకం వ్యాసంలో ఇలా అన్నారు-

 
‘‘రజాకార్ల దుండగాలు ఎక్కువయ్యాయి. వాళ్ళు రాక్షసులను మించిపోయారు. ఆకునూరు, మాచిరెడ్డి పల్లెలలో వారి హింసాకాండ పరాకాష్ఠ నందుకుంది. రజాకార్లు గ్రామీణుల ఇండ్లలో దూరి ధాన్యం మొద లయిన ఆహార పదార్థాలను ఇండ్ల ముందు కుప్పగా పోసి వాటిపై దొడ్డికి వెళ్ళేవాళ్ళు. నిలువ చేసుకున్న నీళ్ళలోను, బావులలోను మూత్రం చేసేవారు. ఈ భీభత్స దృశ్యాలను ‘మీజాన్‌’ ఫోటోలతో సహా ఉన్నదు న్నట్లు ప్రచురించింది. పోలీసులు, ప్రభుత్వాధికార్లు మండిపడ్డారు. గోలపెట్టారు, దర్యాప్తు చేశారు. ప్రముఖ ప్రజానాయకుడు, ధన్వంతరి సదృశ్య వైద్యుడు డా. జయసూర్య తన సోదరి పద్మజా నాయుడును పంపి ఆ గ్రామాలవారి బాధలను వివరంగా సేకరించారు. రజాకార్లు గ్రామ మహిళల మర్మాంగాలపై కాలుతున్న సిగరెట్లు పెట్టడం, చంకలలోను, వక్షోజాల మీద గాట్లు పెట్టడం వంటి దారుణకృత్యాలు, రాక్షసులు చేయనివి బయటపడ్డాయి. పద్మజానాయుడు ఆ వివరా లతో పెద్ద నివేదిక సిద్ధం చేసింది. దానిని నిజాం తెలుగు పత్రిక యథాతథంగా ప్రచురించింది. ప్రభుత్వ సమాచారశాఖ దానిని ఖండిస్తూ ప్రక టన చేసింది. ఆ ప్రకటనను, దురంతాలను తెలుగు ‘మీజాన్‌’ ప్రక్క ప్రక్కనే ప్రచురించింది. ప్రభుత్వం బాపిరాజుగారిని ఇది ఎడిటింగ్‌ పద్ధతి కాదని మందలించగా బాపిరాజుగారు అల్లం, ఎల్లిగడ్డ కంటే ఘాటుగా ఎడిటింగ్‌ విషయం మాకు ప్రభుత్వ సమాచారశాఖలోని ఉద్యోగులు నేర్పవలసినంత దుస్థితిలో మేము లేమని జవాబు వ్రాసి, దానిని ‘మీజాన్‌’లో ప్రచురించారు.
 
‘‘ ‘మీజాన్‌’ పలుకుబడికి స్థానిక వర్గాలలో కొందరికి కన్ను కుట్టింది. ‘రైయత్‌’ ఉర్దూ దినపత్రిక సంపాద కులు మందుముల నరసింగరావుగారు, ‘మీజాన్‌’ పత్రికల విధానం ఏమిటో తమకు అర్థం కావటం లేదని, తెలుగు ‘మీజాన్‌’లో శుద్ధ మూర్ఖులు, అవివేకులు పనిచేస్తున్నారని, వారు హైదరాబాదు రాష్ట్ర రాజకీయాలు తెలిసినవారు కాదని దుమ్మె త్తిపోస్తూ 18 సంపాదకీయాలు వ్రాశారు. దానికి బాపిరాజుగారు 40పుటల ప్రతివిమర్శ వ్రాశారు. అంతేకాదు, ‘నేను చాలా కాలం క్రింద జాతీయో ద్యమంలో చేరుటకు న్యాయవాదవృత్తి మాని వేశాను. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటట్టయితే ‘మీజాన్‌’ చేస్తున్న సేవను నిరూపించడానికి మళ్ళీ నల్లకోటు ధరిస్తాను’ అని సవాల్‌ చేశారు.’’
 
ఏ ఇతర పత్రికా ప్రచురించని, ‘మీజాన్‌’ ప్రచురించిన రజాకార్ల దుండగాల వార్తాంశాన్ని పద్మజానాయుడు తీసుకుని వార్థా వెళ్ళి మహా త్మాగాంధీకి ఇచ్చారు. ఆయన ఈ కిరాతకాలకు చలించి పత్రికలకు విడుదల చేస్తే బయటి ప్రపంచానికి తెలిసిందని పాత్రికేయులు, చిత్రకారులు రాంభట్ల కృష్ణమూర్తి ఒక వ్యాసంలో అంటారు. 1946 జూలై 4న కడివెండి గ్రామంలో జరిగిన దౌష్ట్యాలకు స్పందించి జూలై 25న ‘మీజాన్‌’ దొడ్డి కొమరయ్యను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇలాంటి విషయాలను ఏ కొద్దిగా పరిశీలించినా బాపిరాజు తెగువ, చాతుర్యం ఉన్న సంపాదకుడుగా బోధపడతారు. ‘మీజాన్‌’ తెలుగు పత్రిక సంపాద కుడుగా అడివి బాపిరాజు సేవల గురించి ‘ప్రజా సాహితి’ విలువైన ప్రత్యేక సంచిక 1995లో వెలుగు చూసింది. కానీ 2004లో డా. పొత్తూరు వేంకటేశ్వ రరావు అలా వ్యాఖ్యానించడం ఏమిటో బోధపడటం లేదు!
 
తెలంగాణ తెలుగు పత్రికలలో వ్యావహారిక భాష, వ్యంగ్య రచనలు, సినిమా జర్నలిజం సంబంధించి పూర్తిస్థాయి శీర్షికలను తొలిసారి ప్రవేశపెట్టిన సంపా దకుడు అడివి బాపిరాజు. ఇక్కడ ప్రకాశం పంతులు, తాపీ ధర్మారావులతో అడివి బాపిరాజుకు ఒక పోలిక పెట్టవచ్చు. ప్రకాశం నడిపిన ‘స్వరాజ్య’ పత్రికలో పని చేసిన జర్నలిస్టులు కోటంరాజు రామారావు, ఖాసా సుబ్బారావు, కె. ఈశ్వరదత్‌, జీ.వీ. కృపానిధి తర్వాతి కాలంలో జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల సంపాద కులుగా గొప్పగా రాణించారు. అలాగే తాపీ ధర్మారావు దగ్గర పనిచేసిన సబ్‌ఎడిటర్లు ముగ్గురు నార్ల వెంకటే శ్వరరావు, నీలంరాజు వెంకట శేషయ్య, పి శ్రీరాములు తర్వాతి కాలంలో ఎడిటర్లుగా పేర్గాంచారు. అదే కోవలో అడివి బాపిరాజు దగ్గర పనిచేసిన తిరుమల రామ చంద్ర, విద్వాన్‌ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తి, బి.సి. కామరాజు ఎడిటర్లుగా తర్వాతి కాలంలో వెలిగారు.
 

అడవి గాచిన సంపాదకత్వ ప్రతిభ!బాపిరాజు సంపాదకుడుగా ఎంత ఘనమైన సేవను బాధ్యతగా చేశారో పరిశీలిస్తే బోధపడుతుంది. అదే సమయంలో దినప్రతికలోని హాఫ్‌డెమీ సైజు నాలుగు పేజీలలో మొదటి, చివరిపేజీలు వార్తలకు కేటాయిం చడమూ; రెండవ పేజీలో సంపాదకీయమూ, తన సహచర పండిత పాత్రికేయులు రాసిన విభిన్న కాలమ్స్‌ (ధూపదీపాలు, మిర్చీ మసాలా, నర్తనశాల, కలంపోటు, టైం బాంబు, శృంగాటకం)తో అలంకరించడమూ; మూడవ పేజీలో పూర్తిగా డైలీ సీరియల్‌ ఇవ్వడమూ - గమనిస్తే పత్రికను చాలా ఆర్గనైజ్‌డ్‌గా, ఆధునికంగా నడిపారని గుర్తించగలం! మూడు నాలుగు సెంటీ మీటర్ల కాలమ్‌ మేటర్‌ డైలీ సీరియల్‌లో కొరవ పడితే, మరో సంబంధంలేని వేరే విషయం ఇవ్వ కుండా, సీరియల్‌ కొనసాగించి మూడో పేజీని పూర్తిగా నింపేవారు కానీ, రాజీపడేవారు కాదు!  

తెలుగులో ‘ఉదయం’ దినపత్రికతోనే డైలీ సీరియల్స్‌ మొదలయ్యాయనే విషయం ప్రచారం ఉంది. తిరుమల రామచంద్ర వ్యాసం ప్రకారం ‘ఆంధ్రపత్రిక’ (దినపత్రిక) వారానికోరోజు సీరియల్‌ను ప్రచురించేది. ‘మీజాన్‌’ ద్వారా అడివి బాపిరాజు తెలుగు దినపత్రికలలో డైలీ సీరియల్‌ నవల ప్రచురణ 1944లో ప్రారంభించారు. ఇక్కడ అడవి బాపిరాజు ప్రత్యేకత ఏమిటంటే సంపా దక బాధ్యతలతో తలమునకలుగా ఉంటూనే గొప్ప ప్రామాణిక సాంఘిక, చారిత్రక నవలలు ధారావాహి కంగా రాయడం! బహుశా ఎంతో క్రియాశీలక సంపా దకులుగా ఉంటూనే ఇలా మూడు, నాలుగు డైలీ సీరియల్స్‌ ఒకదాని తర్వాత మరొకటి రాసిన ఏకైక తెలుగు సంపాదకులు అడివి బాపిరాజు మాత్రమే!

నిజానికి ‘మీజాన్‌’లో బాపిరాజు రాసిన వ్యాసాలు, కవితలు, సంపాదకీయాలు ఇతర విషయాలు సంకల నాలుగా రావాలి, తెలంగాణ గురించి మరిన్ని విష యాలు వెలుగులోకి రావాలి! అలాగే కాలగర్భంలో కలవకుండా చూడటం అందరి బాధ్యత!! 

**********

(అడివి బాపిరాజు జన్మదినం అక్టోబర్‌ 8)
నాగసూరి వేణుగోపాల్‌
94407 32392